కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఓం: చాప్టర్-1’. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తొలుత ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 16న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. తాజాగా ‘ఓం’ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ధనుష్, మమ్ముట్టి గన్స్ పట్టుకుని ఉన్న కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
‘ఓం: చాప్టర్-1’లో ధనుష్, మమ్ముట్టితో పాటు సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధనుష్‌కి ఇది మమ్ముట్టితో తొలి కలయిక కావడంతో ఈ కాంబినేషన్‌పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ, ఆర్. కలైవానన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ‘ఓం’ రూపొందుతున్నట్లు ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఎర్రచందనం కోసం అడవుల్లో పనిచేసే కూలీల చుట్టూ కథ సాగనున్నట్లు సమాచారం. పోలీసులు కొందరు కూలీలను అదుపులోకి తీసుకున్న సమయంలో ధనుష్ పాత్ర వారిని కాపాడేందుకు రంగంలోకి దిగే సన్నివేశాలు టీజర్‌లో ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రానికి ‘చాప్టర్-1’ అనే టైటిల్ పెట్టడంతో భవిష్యత్తులో ఈ కథకు కొనసాగింపు ఉండొచ్చనే చర్చ కూడా మొదలైంది.
ఇదిలా ఉంటే.. తొలుత అక్టోబర్ 16న విడుదల చేయాలనుకున్న ‘ఓం’ను రజనీకాంత్ ‘జైలర్ 2’తో పోటీ లేకుండా వాయిదా వేసినట్లు ధనుష్ గతంలో ప్రకటించారు. అలాగే దీపావళి సమయంలో సూర్య నటిస్తున్న ‘సీన్’ విడుదలకు ఇప్పటికే తేదీ ఖరారైన నేపథ్యంలో ఆ సీజన్‌లో కూడా తమ సినిమాను తీసుకురావడం లేదని ఆయన తెలిపారు. ఇప్పుడు నవంబర్ 20న కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేయడంతో ధనుష్, మమ్ముట్టి అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
[Dhanush Om Movie, Mammootty Dhanush Om, Om Chapter 1, Om Chapter 1 Release Date, Dhanush Mammootty Movie, Om Movie New Release Date, Dhanush Latest Movie, Mammootty Latest Movie, Sai Pallavi Om Movie, Sreeleela Om Movie, Rajkumar Periasamy Om, Om Chapter 1 November 20]





