Home

»

Latest News

‘డియర్ ఆస్ట్రోనాట్’లో గౌతమ్ మీనన్.. హీరోహీరోయిన్లు లేకుండానే ప్రమోషన్స్ షురూ!

Sep 22, 2026 4:06PM

వరుణ్ సందేశ్, వితికా శేరు దంపతులు దాదాపు పదకొండేళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారనే వార్తలతో ‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమాపై మొదట్లో ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా ఈ చిత్రంలో వితికా శేరు వ్యోమగామి పాత్రలో కనిపించనున్నారని, చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలనే కలను సాకారం చేసుకునే ఓ మహిళ కథగా సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కొద్ది రోజుల క్రితం తాను, తన భర్త వరుణ్ సందేశ్ ‘డియర్ ఆస్ట్రోనాట్’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వితికా శేరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని వివాదాస్పదం చేయడం తమ ఉద్దేశం కాదని, అయితే ఇకపై ఈ ప్రాజెక్ట్‌తో తమకు సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. సినిమా కారణంగా తాము కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు ఆమె చేసిన ప్రకటనను బట్టి తెలుస్తోంది. అయితే ఈ జంట స్థానంలో ఎవరిని తీసుకుంటారనే విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

ఇలాంటి పరిస్థితుల్లోనే ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుంచి తాజాగా మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో డేవిడ్ థామస్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. దర్శకుడు కార్తీక్ భాగ్యరాజా మాట్లాడుతూ.. గౌతమ్ మీనన్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని, సినిమాలో ఆయన క్యారెక్టర్ హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు.

‘డియర్ ఆస్ట్రోనాట్’ కథ విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఓ మహిళ తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది అనేదే ప్రధాన కథాంశం. ఆకాశాన్ని అందుకోవాలనే ఆమె ఆశయం వెనుక ఉన్న సవాళ్లు, పట్టుదల, ఆశ, భావోద్వేగాలను సినిమాలో చూపించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. దీంతో ఇది సాధారణ ప్రేమకథకు భిన్నంగా స్ఫూర్తిదాయకమైన కథగా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

ఇక సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని దర్శకుడు తెలిపారు. అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, ఇకపై సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ ‘క్యారెక్టర్ రివీల్ వీక్’ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మొదటగా గౌతమ్ మీనన్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

మరోవైపు ప్రధాన పాత్రలో నటించిన వితికా శేరు, కీలక పాత్రలో ఉన్న వరుణ్ సందేశ్ సినిమా నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. వారి పాత్రలను మళ్లీ ఇతర నటీనటులతో షూట్ చేస్తారా? లేక ఏదైనా పరిష్కారం ద్వారా ఈ జంటను తిరిగి ప్రాజెక్ట్‌లోకి తీసుకొస్తారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

మనస్విని భాగ్యరాజా సమర్పణలో యువన్ కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ బి. కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు.

 

 

[Dear Astronaut, Dear Astronaut Movie, Dear Astronaut First Look, Gautham Vasudev Menon, Gautham Menon Dear Astronaut, Varun Sandesh, Vithika Sheru, Vithika Sheru Dear Astronaut, Dear Astronaut Telugu Movie, Karthik Bhagyaraja, Dear Astronaut Character Reveal, Dear Astronaut October Release, Telugu Cinema, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com