Home

»

Latest News

రూమ‌ర్ల‌కు చెక్‌.. చిరంజీవితో సినిమాపై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల.! 

Aug 22, 2026 6:37PM

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గతంలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టూ గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కథ విషయంలో వ్యత్యాసాల వల్ల లేదా శ్రీకాంత్ ఓదెల వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లన్నింటికీ స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా "మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో మరచిపోలేని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బాస్" అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కాంబో ప్రాజెక్ట్ రద్దయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

డైరెక్టర్‌గా తొలి చిత్రం 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో కొంత ఆలస్యం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను నాచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తున్నారు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ మాస్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.

గతంలో విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రక్తంతో తడిసిన చేతులు కనిపించడంతో, ఇది మెగాస్టార్ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, అది పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్లారిటీతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com