Home

»

Latest News

టాలీవుడ్ పెద్దలతో చిరంజీవి చర్చలు.. వాటాల కోసమేనా అంటూ నారాయణ విమర్శలు!

May 28, 2026 5:13PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల జరిగిన ఒక కీలక పరిణామం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు, ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా భావించే చిరు నివాసంలో జరిగిన ఈ భేటీపై సీపీఐ జాతీయ నేత నారాయణ తనదైన శైలిలో విమర్శలు గుప్పించడం సంచలనం రేపుతోంది.

ఈ సమావేశం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఈ భేటీలో పరిశ్రమ బాగు కోసం చర్చించారా, లేక లాభాల వాటాలు పంచుకోవడంపై మాట్లాడుకున్నారా? అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో సామాన్య ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు.

ముఖ్యంగా టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో టికెట్ ధ‌ర‌లు పెంపు, అర్ధరాత్రి బెనిఫిట్ షోల అనుమతులపై నారాయణ మండిపడ్డారు. పెద్ద సినిమాలు వస్తున్నాయనే నెపంతో నిర్మాతలు పదేపదే రేట్లు పెంచుకుంటూ పోతుంటే, ప్రభుత్వాలు కూడా అడిగిందే తడవుగా జీవోలు జారీ చేయడంపై ఆయన దుయ్యబట్టారు. సినిమా అనేది కేవలం సామాన్యుడి వినోద సాధనమని, దాన్ని వ్యాపార దోపిడీగా మార్చవద్దని హితవు పలికారు.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వాల వద్ద సరైన విధివిధానాలు లేకపోవడాన్ని నారాయణ తప్పుబట్టారు. ఒక స్పష్టమైన పాలసీ లేకపోవడం వల్లే సామాన్య కుటుంబాలపై మోయలేని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా సినిమా రంగంలోని పలు సమస్యలపై, సెలబ్రిటీల వ్యవహారాలపై నారాయణ స్పందిస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మరోసారి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. సామాన్య ప్రేక్షకుల పక్షాన నారాయణ మాట్లాడిన మాటల్లో నిజం ఉందంటూ కొందరు మద్దతు తెలుపుతుండగా, సినిమా మేకింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగిన తరుణంలో టికెట్ ధరల పెంపు తప్పదంటూ పరిశ్రమ వర్గాల వాదనను మరికొందరు గుర్తు చేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ, మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో జరిగిన ఈ నిర్మాతల సమావేశం రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందోన‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అటు ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి స్పష్టత వస్తుందో, ఇండస్ట్రీ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com