ఆ డాన్సేంటి మహేష్ బాబూబూబూబూబూ...!
on May 21, 2016
బ్రహ్మోత్సవం పై బోల్డన్ని సెటైర్లు పేలుతున్నాయి... అదేంటో సినిమా విడుదలై ఒక్క రోజు కాలేదు.. అప్పుడే పేరడీలూ, కామిక్కులు మొదలైపోయాయి. ఇది బ్రహ్మోత్సవం కాదు.. నీరసం నిరుత్సాహం అని కొందరు, టీవీ సీరియల్‌ని వెండితెరపై చూడాలనుకొనేవాళ్లు మాత్రం ఈ సినిమాకి వెళ్లండి అని మరికొందరు ఎలా పడితే అలా ఆడుకొంటున్నారు. మరీ ముఖ్యంగా బాలా త్రిపుర మణి సాంగులో మహేష్ డాన్సులు చూడాలి.. నవ్వుకోలేక ఛస్తున్నారు జనాలు.
షర్టు మీద దుమ్ముపడినట్టు కాసేపు దులుపుకొని, ఫ్యాంటు లూజ్ చేసుకొంటున్నట్టు ఇటూ సర్దుకొని, తప్పయిపోయింది బాబూ అని చంపలు కొట్టుకొని... దాన్నే స్టెప్పంటే ఎలా??? ఈ డాన్సింగ్ స్టైల్‌ని వీడియోలు తీసి... నవ్వుకోండ్రా బాబూ.. అంటూ ఫేస్‌బుక్‌లోనూ, ట్విట్టర్లోనూ షేర్ చేస్తున్నారు జనాలు. `అసలు నేను ఎంచుకొన్న ట్యూన్ ఏంటి? నువ్వేస్తున్న స్టెప్పేంటి? ` అంటూ కింగ్ సినిమాలో బ్రహ్మానందాన్ని గుర్తు చేసుకొంటున్నారు. ఇంకొంతమందైతే `నిన్నెవడ్రా డాన్స్ వేయమన్నాడు` అంటూ జుత్తు పీక్కుంటున్నారు. బ్రహ్మాత్సవంలో కామెడీ లేదుగానీ, చూసొచ్చాక మాత్రం ఇలాంటి కామెడీ కామెంట్లు బోల్డన్ని చూసుకొంటూ సరదా పడుతున్నారు నెటిజన్లు. అలాగైనా బ్రహ్మోత్సవం కాసేపు నవ్వించగలిగింది.