'గీతా ఆర్ట్స్'లో మరో ఛాన్స్ కొట్టేసిన 'బొమ్మరిల్లు భాస్కర్'!
on Oct 23, 2021
ఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్ 'బొమ్మరిల్లు భాస్కర్' ఇటీవల విడుదలైన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్2 బ్యానర్.. 'బొమ్మరిల్లు' భాస్కర్ కి మరో ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
'బొమ్మరిల్లు(2006)' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన భాస్కర్.. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. అనంతరం అల్లు అర్జున్ తో చేసిన 'పరుగు(2008)'తో మెప్పించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. ఆ తర్వాత 'ఆరెంజ్(2010)', 'ఒంగోలు గిత్త(2013)' సినిమాలతో నిరాశపరిచాడు. ఆ తర్వాత 'బెంగుళూరు డేస్' రీమేక్ తో కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న భాస్కర్.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో ఓ సినిమా చేశాడు. అదే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హీరోగా అఖిల్ కి ఫస్ట్ హిట్ ని అందించడంతో పాటు.. డైరెక్టర్ గా భాస్కర్ కి కమ్ బ్యాక్ హిట్ ఇచ్చింది.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సక్సెస్ తో బొమ్మరిల్లు భాస్కర్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయట. పలు నిర్మాణ సంస్థలు ఆయనను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్-2 సైతం ఆయనతో మరో సినిమా చేయడానికి సిద్ధమైందని సమాచారం. మంచి కథను రెడీ చేసుకోమని బన్నీ వాసు చెప్పడంతో.. ప్రస్తుతం భాస్కర్ అదే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఒక యంగ్ హీరోని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ డ్రామా కథను రెడీ చేస్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.