'బంగార్రాజు'కి భారీ సవాల్.. అద్భుతం జరిగేనా?
on Jan 13, 2022

అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య నటించిన సినిమా 'బంగార్రాజు'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రేపు(జనవరి 14 న) విడుదల కానుంది. అయితే బంగార్రాజు సంక్రాంతి విన్నర్ గా నిలవాలంటే భారీ సవాల్ ఎదుర్కోవాల్సి ఉంది.
కరోనా కారణంగా సంక్రాంతి బరి నుంచి పాన్ ఇండియా సినిమాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' తప్పుకోవడంతో ఈ సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద సినిమా బంగార్రాజే అయింది. గతంలో సూపర్ హిట్ అయిన 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వెల్ కావడం, తండ్రీకొడుకులు నాగార్జున, చైతన్య కలిసి నటించిన సినిమా కావడంతో బంగార్రాజుపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఓవరాల్ గా రూ.38 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బంగార్రాజు రూ.39 కోట్ల మార్క్ దాటితే హిట్ గా నిలుస్తుంది. పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతికి 39 కోట్లు కలెక్షన్స్ రావడం అనేది పెద్ద మేటర్ కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులే బంగార్రాజుని కాస్త కలవరపెడుతున్నాయి.
బంగార్రాజు ఏపీలో దాదాపు రూ.23 కోట్ల బిజినెస్ చేసింది. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. ఆ కారణంగానే ఇటీవల సూపర్ హిట్స్ గా నిలిచిన అఖండ, పుష్ప సినిమాలు అన్ని చోట్లా లాభాలను చూడగా ఏపీలో మాత్రం నష్టాలను చూశాయి. అఖండ కృష్ణ, గుంటూరులో స్వల్ప నష్టాలు మూటగట్టుకోగా, పుష్ప మాత్రం ఏపీలో భారీగానే నష్టాలు చూసింది. ఈ టికెట్ ధరల తగ్గింపు ప్రభావం బంగార్రాజుపై కూడా పడే అవకాశం ఉంది. దానికి తోడు 18 నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూతో పాటు థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీ అమలులోకి రానున్నాయి. నైట్ కర్ఫ్యూ విధిస్తే సెకండ్ షో వేసుకునే అవకాశం ఉండదు. 50 శాతం ఆక్యుపెన్సీతో, రోజుకి మూడు షోలతో భారీ కలెక్షన్స్ రాబట్టడం కష్టమే. కాబట్టి బంగార్రాజు ఏ అద్భుతం చేసినా మొదటి నాలుగు రోజుల్లోనే చేయాలి. ఈ సవాల్ ని అధిగమించి బంగార్రాజు సంక్రాంతి విన్నర్ గా నిలుస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



