
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కలయికలో సినిమా వస్తోంది అనగానే ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మాస్ యాక్షన్ అంశాలతో పాటు సామాజిక స్పృహ కలగలిపిన కథలను అందించడంలో కొరటాల దిట్ట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారు కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తారనే అంశంపై మళ్లింది. ముఖ్యంగా బాలయ్య లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ ప్రాజెక్ట్‌లో లేరా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
థమన్ - బాలయ్య హిట్ కాంబోకు బ్రేక్?
గత కొన్నేళ్లుగా బాలకృష్ణ సినిమాలకు థమన్ వెన్నెముకగా నిలుస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి చిత్రాలకు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించింది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా థమన్ ఇచ్చే మాస్ మ్యూజిక్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. అయితే, కొరటాల శివ సినిమాలో థమన్ పేరు వినిపించకపోవడం నందమూరి అభిమానులను కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
లైన్లోకి అనిరుధ్ రవిచందర్?
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకోవాలని కొరటాల భావిస్తున్నారట. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన 'దేవర' చిత్రానికి అనిరుధ్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. ఆ బాండింగ్‌తోనే బాలయ్య సినిమాకు కూడా అనిరుధ్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ కనుక ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే, బాలయ్య సినిమాకు సరికొత్త సౌండింగ్ లభించడం ఖాయం.






