మాస్ మహారాజా రవితేజ, క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ఎమోషనల్ డివోషనల్ యాక్షన్ డ్రామా 'ఇరుముడి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రవితేజ యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్లు ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఆ చిన్నారే కేరళకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర. సినిమాలో 'మణికంఠ' అలియాస్ 'మణెమ్మ' పాత్రలో ఆమె చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రవితేజతో వచ్చే తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ సీన్లలో ఆమె సహజమైన అభినయం ఆడియన్స్‌తో కంటతడి పెట్టిస్తోంది. తొలి తెలుగు చిత్రమే అయినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ఈ చిన్నారి, తన పాత్రకు సొంతంగా తెలుగులోనే డబ్బింగ్ చెప్పడం విశేషం.
ఇంతటి ప్రాధాన్యత ఉన్న లక్కీ ఆఫర్ ఈ చిన్నారికి ఎలా వచ్చిందనే విషయంపై రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నక్షత్ర ఆసక్తికర విశేషాలను వెల్లడించింది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న నక్షత్రకి సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమట. అలా ఆమె చేసిన కొన్ని రీల్స్ చూసిన దర్శకుడు శివ నిర్వాణ, ఈ కథలోని అమాయకమైన, బలమైన పాత్రకు నక్షత్ర అయితే సరిగ్గా సరిపోతుందని భావించి ఆఫర్ ఇచ్చారని తెలిపింది.
మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో, మాస్ రాజా రవితేజ వంటి పెద్ద హీరోతో కలిసి నటించడం తన అదృష్టమని నక్షత్ర సంతోషం వ్యక్తం చేసింది. షూటింగ్ సమయంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని, దర్శకుడు శివ నిర్వాణ ప్రోత్సాహంతో ఆడుతూ పాడుతూ తన పాత్రను పూర్తి చేశానని వెల్లడించింది.
చిన్న వయసులోనే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి.. పృథ్వీరాజ్ సుకుమారన్, శివరాజ్ కుమార్ వంటి అగ్ర కథానాయకులతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. స్కూల్ టీచర్లు, తల్లిదండ్రుల సహకారంతో చదువును, నటనను సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం 'ఇరుముడి' విజయంలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్రపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన ఈ చిన్నారికి భవిష్యత్తులో టాలీవుడ్‌లో మరింత మంచి అవకాశాలు వచ్చి వెండితెరపై ముద్ర వేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Baby Nakshatra Irumudi Movie, Ravi Teja Irumudi Child Artist, Baby Nakshatra Instagram Reels, Siva Nirvana Irumudi Movie Update, Baby Nakshatra Telugu Dubbing





