అనుపమకి మరోసారి కలిసొచ్చేనా!
on Oct 13, 2021
దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ విజయాలు చవిచూసింది కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్. మరీముఖ్యంగా.. తెలుగునాట నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ టాలెంటెడ్ యాక్ట్రస్. ప్రస్తుతం అనుపమ చేతిలో `రౌడీ బాయ్స్`, `18 పేజెస్`, `కార్తికేయ 2`, `హెలెన్` వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ చిత్రాలన్నింటిలోనూ అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో దర్శనమివ్వబోతోంది మిస్ పరమేశ్వరన్.
ఇదిలా ఉంటే.. `కొడి`తో తమిళ ప్రేక్షకులను అలరించిన అనుపమ.. ఐదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరో కోలీవుడ్ ప్రాజెక్ట్ తో పలకరించబోతోంది. ఆ చిత్రమే.. `తళ్ళి పోగాదే`. నాలుగేళ్ళ క్రితం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న `నిన్ను కోరి` ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అధర్వ మురళికి జంటగా నటించింది అనుపమ. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు అనుపమ నటించిన రీమేక్ చిత్రాలన్నీ మంచి విజయమే సాధించాయి. అలనాటి తెలుగు చిత్రం `మీనా` ఆధారంగా రూపొందిన `అ ఆ`, మాలీవుడ్ సెన్సేషన్ `ప్రేమమ్`కి రీమేక్ గా తెరకెక్కిన తెలుగు `ప్రేమమ్`, కోలీవుడ్ థ్రిల్లర్ `రాక్షసన్`కి తెలుగు వెర్షన్ గా తయారైన `రాక్షసుడు`.. ఇలా ఇప్పటికే అనుపమ ఖాతాలో మూడు రీమేక్ హిట్స్ ఉన్నాయి.
మరి, అనుపమ సెంటిమెంట్ రిపీట్ అయి.. త్వరలో థియేటర్స్ లో సందడి చేయనున్న `తళ్ళి పోగాదే` కూడా మంచి విజయం సాధిస్తుందేమో చూడాలి.
Also Read