
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ 'NBK 111' షూటింగ్ సెట్‌లో అనుకోకుండా ఒక ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో గడచిన మూడు రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ప్రముఖ నటుడు మంచు మనోజ్ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసుకుని ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా, కేజీఎఫ్ ఫేమ్ 'గరుడ' రామ్, బాలకృష్ణల మధ్య భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం తీస్తున్న సమయంలోనే ఊహించని విధంగా బాలకృష్ణ కాలు స్లిప్ అయ్యి కిందపడిపోవడంతో, ఆయన మోకాలు నేరుగా నేలకు బలంగా గుద్దుకుంది. ఈ అనూహ్య ఘటనతో ఆయన మోకాలి వద్ద ఉన్న కండరం తీవ్రంగా గాయపడింది (మజిల్ టియర్).
అయితే, గాయం తగిలిన వెంటనే సెట్‌లోని ప్రొడక్షన్ బృందం తీవ్రంగా కంగారు పడినప్పటికీ, బాలయ్య మాత్రం ఏమాత్రం అధైర్యపడలేదు. "ఏమీ కాదు షూటింగ్ కొనసాగిద్దాం.. లంచ్ బ్రేక్ తర్వాత హాస్పిటల్ కి వెళ్దాం" అంటూ సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. కానీ, చిత్ర యూనిట్ ఒత్తిడి మేరకు ఆయనను కాకినాడలోని సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించిన అనంతరం, మోకాలి జాయింట్ వద్ద మజిల్ టియర్ అయినట్లు స్పష్టం చేశారు. పూర్తి కోలుకోవడానికి ఒక చిన్నపాటి సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో, తదుపరి చికిత్స నిమిత్తం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ ఇచ్చారు. కాగా, జులై 28 వరకు ప్లాన్ చేసిన ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో రాజమండ్రి జైలు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సీన్లకు హీరో అవసరం లేకపోవడంతో, చిత్ర బృందం యథావిధిగా షూటింగ్‌ను కొనసాగిస్తోంది.
ఈ ఘటనపై NBK హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్, బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్ 'తెలుగువన్'తో స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నట్లు చెప్పిన జగన్, " బాలయ్య గారికి చిన్న గాయమైంది. గాయంతోనే షూటింగ్ చేయడానికి సిద్ధపడ్డారు. మూవీ టీం ఒత్తిడితో హాస్పిటల్ కి వెళ్ళారు. సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకొని, మళ్ళీ ఉత్సాహంగా తిరిగి వస్తారు. బాలయ్యకు గాయాలు కొత్త కాదు. ఆయనకు డూప్ లు పెట్టుకోవడం నచ్చదు. డూప్‌లను పెడితే ఆ డూప్ చేసే వ్యక్తి కూడా ఒక మనిషే కదా, ఆయనకు ప్రాణాపాయం రాకూడదు అనే ఉదార స్వభావం ఆయనది. అభిమానులను సంతోషపెట్టడం కోసం ఎంతటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధపడే మా బాలయ్యకు కోట్లాది మంది అభిమానుల దీవెనలు ఉన్నాయి" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
గతంలో 'లెజెండ్' సినిమా చిత్రీకరణ సమయంలో కూడా గుర్రం గ్లాస్ బ్రేకింగ్ సీన్ చేయగా ఆయన ముక్కుపై గాజు పెంకు గుచ్చుకుని గాయమైంది. అలాగే ట్రైన్ ఇంజిన్ పైనుంచి రొటేట్ అవుతున్న సుమో వాహనంపైకి రోప్ సాయంతో దూకే క్రమంలో, టైమింగ్ మిస్సై వాహనం బలంగా తొడకు తగిలినా కేవలం రెండు నిమిషాలు ఆయింట్‌మెంట్ రాసుకుని 'నెక్స్ట్ టేక్' అని చెప్పిన ఘనత ఆయనది. సినిమా పట్ల అంతటి అమితమైన తపన, క్రమశిక్షణ కలిగిన బాలకృష్ణకు ఈ చిన్నపాటి గాయం ఒక దిష్టి చుక్క లాంటిదని, ఆయన మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఎనర్జీతో అతి త్వరలోనే షూటింగ్ సెట్‌లోకి అడుగుపెడతారని సినీ వర్గాలు, అభిమానులు విశ్వసిస్తున్నారు.
Nandamuri Balakrishna, Injury, NBK 111 Shooting, Anantapuram Jagan






