
కుటుంబం..అన్నగారి కుటుంబం అని పెద్దన్నయ్య మూవీలో ఫేమస్ సాంగ్ ఒకటుంటుంది. ఈ పాటని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీని చూస్తూ అభిమానులు నిత్యం పాడుకుంటూ ఉంటారు. అంతలా కొన్ని దశాబ్దాల నుంచి కుటుంబానికి సంబంధించిన ఆస్తుల్లో ఎలాంటి వివాదాలు రాలేదు.
కానీ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కుటుంబానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన, కోట్లాది రూపాయల విలువైన 'జల్సా' బంగ్లా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఈ ఐకానిక్ భవనం యాజమాన్య హక్కులపై కుటుంబంలోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అమితాబ్ బచ్చన్ తమ్ముడు అతాబ్ బచ్చన్ (అజితాబ్ బచ్చన్) సతీమణి, అనగా అమితాబ్ మరదలు రమోలా బచ్చన్ ఏకంగా 33 ఏళ్ల క్రితం జరిగిన ఒక గిఫ్ట్ డీడ్‌ని సవాల్ చేస్తూ ముందుకు రావడం బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది.
దీంతో దశాబ్దాలుగా ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ కుటుంబంలో ఆస్తికి సంబంధించిన లీగల్ వార్ హాట్‌టాపిక్‌గా మారింది.అసలు వివాదానికి మూలమైన ఈ ఆస్తి చరిత్రను పరిశీలిస్తే, మొదట్లో దీనిని 'మంశా' అని పిలిచేవారు. ఇది ప్రముఖ నిర్మాత ఎన్.సి. సిప్పీకి చెందినది. 1982లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'సత్తె పే సత్తా' సినిమాకు గాను రెమ్యునరేషన్‌గా ఆయన ఈ ఆస్తిని అమితాబ్ బచ్చన్‌కు ఇచ్చారని సమాచారం.

ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల ఈ బంగ్లాని విక్రయించినప్పటికీ, జయ బచ్చన్ సూచన మేరకు అమితాబ్ బచ్చన్ దీనిని మళ్లీ ఎక్కువ ధర వెచ్చించి కొనుగోలు చేసి, పునర్నిర్మించి 'జల్సా'గా పేరు మార్చారు. ప్రస్తుతం సుమారు 10,125 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ బంగ్లా విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఇది కూడా చదవండి: తెలుగు సినిమాలో టీం ఇండియా స్టార్ స్పిన్నర్ మాజీ వైఫ్ హీరోయిన్ గా!
ప్రతీ ఆదివారం అమితాబ్ అభిమానులు ఈ బంగ్లా గేటు ముందు గుమికూడి అమితాబ్ ని దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేక ఆచారం. అయితే, ఈ బంగ్లా యాజమాన్య హక్కులకు సంబంధించి రికార్డుల్లో తీవ్రమైన పొంతన లేకపోవడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. కపోల్ హౌసింగ్ సొసైటీ రికార్డుల ప్రకారం ఈ ప్రాపర్టీ జయా బచ్చన్ పేరున ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రాపర్టీ కార్డ్‌లో మాత్రం ఇప్పటికీ రమోలా బచ్చన్ పేరు కొనసాగుతుండటం గమనార్హం. ప్రభుత్వ రికార్డుల్లో రమోలా పేరును తొలగించి, ఆ స్థానంలో జయా బచ్చన్ పేరును చేర్చేందుకు ప్రయత్నాలు జరగడంతో ఈ సుదీర్ఘ వివాదం ఒక్కసారిగా బయటపడింది.
గడచిన ఏడు నెలలుగా రమోలా బచ్చన్ ఈ అంశంపై రిజిస్ట్రేషన్ అధికారుల వద్ద వరుస ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఈ మొత్తం తంతు వెనుక ప్రధాన వివాదం 1993 నాటి గిఫ్ట్ డీడ్ చుట్టూ తిరుగుతోంది. ఆ సమయంలో ఈ ఆస్తి తన పేరు మీద ఉండేదని, కానీ తన అనుమతి లేకుండా లేదా తనకు తెలియకుండానే ఆ గిఫ్ట్ డీడ్ ద్వారా యాజమాన్య హక్కులను జయా బచ్చన్‌కు బదలాయించారని రమోలా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఆ నాటి పత్రాన్ని ఎలాంటి స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా కేవలం సాధారణ కాగితంపై తయారు చేశారని, దానిపై సాక్షుల సంతకాలు కూడా లేవని ఆమె తన ఫిర్యాదుల్లో గట్టిగా ప్రస్తావించారు. ఆ పత్రాలను ఎలాంటి నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేశారు? మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అభయ్ యోజన' పథకం కింద దానిని ఎలా క్రమబద్ధీకరించారు? అనే ప్రశ్నలను ఆమె లేవనెత్తారు.

ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై అంధేరిలోని డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కార్యాలయం విచారణ ప్రారంభించింది. డిప్యూటీ రిజిస్ట్రార్ ఫైయాజ్ ములానీ స్పందిస్తూ.. తమకు ఫిర్యాదు అందిందని, విచారణను మొదలుపెట్టి సంబంధిత పక్షాలన్నింటినీ వివరణ కోరమన్నట్లు వెల్లడించారు.
మరోవైపు, అమితాబ్ బచ్చన్ కుటుంబం ఈ వివాదంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జయా బచ్చన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని, అభిషేక్ బచ్చన్ ప్రతినిధి మాత్రం ఇది పూర్తిగా కుటుంబ అంతర్గత వ్యవహారమని పేర్కొంటూ వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. 33 ఏళ్ల కిందటి పత్రాల చెల్లుబాటు, ఈ హై-ప్రొఫైల్ ఆస్తి అసలు వారసులెవరు అనే దానిపై అధికారుల తుది నిర్ణయం ఎటువైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు బాలీవుడ్‌లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
మీకు నచ్చవచ్చు:అనశ్వర రాజన్ ఎవరు: వైరల్ గా మారిన విశ్లేషణ!
మీకు నచ్చవచ్చు:రామాయణ పై మహేష్ సన్ షాకింగ్ రివ్యూ!
[Amitabh Bachchan, Jalsa Property Dispute, Jaya Bachchan, Ramola Bachchan, Tollywood]





