టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్ బిజినెస్ స్ట్రాటజీల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సాధారణంగా సినిమా పాటలకు, డైలాగులకు కాపీరైట్ ఉండటం మనం చూస్తుంటాం. కానీ, ఒక హీరో తన డ్యాన్స్ స్టెప్పులకు, మేనరిజమ్స్‌కు కూడా చట్టపరమైన రక్షణ కల్పించుకోవాలని భావించడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బన్నీ తన రాబోయే సినిమా 'రాక' (Raaka) కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గతంలో 'పుష్ప' సినిమాలోని 'తగ్గేదేలే' మేనరిజం, 'శ్రీవల్లి' స్టెప్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. అయితే, వీటిని అనేక లోకల్ బ్రాండ్లు, కమర్షియల్ యాడ్స్, ఏఐ (AI) వీడియోలు తమ ప్రచారం కోసం అనుమతి లేకుండా వాడేసుకున్నాయి. దీనివల్ల నటుడిగా బన్నీ బ్రాండ్ వాల్యూ దెబ్బతినే అవకాశం ఉందని భావించిన మేకర్స్, ఈసారి ముందుగానే అప్రమత్తమయ్యారు.
ప్రస్తుతం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం 'రాక'లో నటించబోతున్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అట్లీ కొన్ని అదిరిపోయే సిగ్నేచర్ మూమెంట్స్, స్టైలింగ్ డిజైన్ చేస్తున్నారట. ఈ స్టెప్పులు బయటకు రాకముందే వాటిపై పూర్తి హక్కులను రిజర్వ్ చేయాలని బన్నీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
కేవలం డ్యాన్స్ స్టెప్పులే కాకుండా.. తన పేరు, వాయిస్, ఇమేజ్, పర్సనాలిటీ రైట్స్‌ను ఇతరులు వ్యాపార ప్రయోజనాల కోసం వాడకుండా రక్షణ కల్పించాలని బన్నీ కోరారు. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి అగ్ర నటులు కూడా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఇలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు సౌత్ నుంచి అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరిన తొలి యువ హీరోగా నిలిచారు.
నేటి డిజిటల్ యుగంలో ఏఐ టెక్నాలజీతో ఫేక్ వీడియోలు సృష్టించడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోల మేనరిజమ్స్‌తో మీమ్ పేజీలు, చిన్న సంస్థలు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఫ్యాన్స్ చేసే రీల్స్ వల్ల ఇబ్బంది లేకపోయినా, అనుమతి లేకుండా కమర్షియల్ యాడ్స్ లో వాడితే మాత్రం ఇకపై బన్నీ టీమ్ నుంచి లీగల్ నోటీసులు వెళ్లడం ఖాయం.






