
టాలీవుడ్ లో ‘కింగ్’ అనే పదానికి నిలువెత్తు రూపం అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). గ్లామర్, స్టైల్, సరికొత్త ప్రయోగాలు కలగలిసిన ఆయన సినీ ప్రస్థానం మొదలై నేటికి సరిగ్గా 40 ఏళ్ళు పూర్తయింది. 1986 వ సంవత్సరంలో వి. మధుసూదనరావు దర్శకత్వంలో, అక్కినేని వెంకట్ నిర్మాణ సారథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై వచ్చిన 'విక్రమ్' (Vikram) సినిమాతో నాగార్జున హీరోగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు.
హిందీలో ఘనవిజయం సాధించిన 'హీరో' చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్, నాగ్ కెరీర్‌కు ఒక బలమైన పునాది వేసింది. ఒక నటుడిగా తనను తాను నిరూపించుకోవడమే కాకుండా, అక్కినేని వారసుడిగా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో నాగార్జున తొలి అడుగులోనే విజయం సాధించారు. నటన, ఫైట్స్, డాన్సుల్లో తనదైన శైలిని చూపిస్తూ నాటి యువత గుండెల్లో మన్మథుడిగా స్థానం సంపాదించుకున్నారు.

నాగార్జున నట జీవితంలో మే 23 తేదీకి ఒక ప్రత్యేకమైన, భావోద్వేగపూరితమైన బంధం ఉంది. 1986 మే 23న ఆయన హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. నాగార్జున హీరోగా అడుగుపెట్టిన సరిగ్గా 28 ఏళ్ళ తర్వాత, అంటే 2014 మే 23న అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించిన అద్భుత కావ్యం 'మనం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ఆయన తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా కావడం విశేషం. తన కుమారుడు నాగచైతన్యతో కలిసి నాగ్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లాసిక్‌గా నిలిచిపోయింది. తండ్రి చివరి జ్ఞాపకాన్ని, కొడుకుతో కలిసి పంచుకుంటూ, తన తొలి సినిమా విడుదలైన అదే తేదీన 'మనం' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం నాగార్జున జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది.
ఈ సుదీర్ఘమైన 40 ఏళ్ళ ప్రస్థానంలో నాగార్జున ఎన్నో మైలురాళ్ళను అధిరోహించారు. శివ, గీతాంజలి, అన్నమయ్య, శ్రీరామదాసు, మన్మథుడు వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలను సమాంతరంగా చేస్తూ మన్మథుడిగా, కింగ్‌గా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఎందరో కొత్త దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనది.
ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని నాగార్జున సోషల్ మీడియా వేదికగా తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. ఈ ప్రయాణంలో అండగా తనకు అండగా నిలిచిన అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మరిన్ని మే 23 లు రావాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు.
అక్కినేని అభిమానులు కూడా సోషల్ మీడియాలో #40YearsOfNagarjuna అంటూ నాగార్జున 40 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.






