ముద్దులు ఉంటే చెత్త సినిమాలా?
on Feb 1, 2020
ముద్దులు ఉన్నంత మాత్రాన ఏ సినిమా చెత్తది కాదని ఐశ్వర్య రాజేష్ అంటోంది. ముద్దులు లేనంత మాత్రాన ఓ సినిమా మంచిది అయిపోదని చెబుతోంది. ఏదైనా కథలో భాగంగా ఉండాల్సిందేనని ఆవిడ చెప్పే మాట. ఇప్పుడు ఈ ముద్దుల గురించి ఇంత మ్యాటర్ ఎందుకు చెబుతున్నారంటే... ఈ తెలుగమ్మాయి నటించిన తాజా సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఆల్రెడీ విడుదలైన స్టిల్స్, ప్రోమోస్ కొంచెం ఘాటుగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా మధ్య సన్నివేశాలు బోల్డ్ అనే చెప్పుకోవాలి. సంప్రదాయంగా చీరలో ఐశ్వర్య రాజేష్ కనిపించినా... ఆమెకు, విజయ్ దేవరకొండకు మధ్య ముద్దు సన్నివేశాలు ఉన్నాయని టాక్. అదే మాట ఆమెను అడిగితే... "మా మధ్య ముద్దు సన్నివేశాలు ఉన్నాయో లేవో సినిమా చూసి తెలుసుకోండి" అని సెలవిచ్చారు.
సాధారణంగా కథానాయకులుగా వచ్చే తెలుగు అమ్మాయిలు ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ చేయడానికి ఇబ్బంది పడతారని అంటుంటారు. ఆల్రెడీ తమిళ సినిమా 'వడ చెన్నై'లో ఐశ్వర్య రాజేష్ నాలుగు లిప్ లాక్ సీన్స్ చేశారు. "కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్స్ చేయడంలో తప్పేం లేదు. తప్పదు కూడా" అని ఆమె అన్నారు. 'వరల్డ్ ఫేమస్ లవర్'లో నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ ఎవరి పాత్రకు ఉండే ప్రాధాన్యత వాళ్ల పాత్రకు ఉందని ఆమె చెప్పారు. విజయ్ దేవరకొండతో సినిమా, పైగా పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో వెంటనే అంగీకరించాను అని అన్నారు.