
ఎంత షో చేస్తూ ఉన్న హారతి కర్పూరంలా వయసు కరిగిపోతుందనేది ఎంత నిజమో, నటీమణుల సినీ వయసు కూడా కరిగిపోతుందనేది అనే నిజం. అందుకు ఇప్పుడు ఆద్యులుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్, కరీనా కపూర్ నిలిచారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
బాలీవుడ్ వెండితెరపై దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యం వహించి, తమ అభినయంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలని గెలుచుకున్నారు ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ ఖాన్‌ల సినిమా కెరీర్ ఇప్పుడు తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు వీరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేవి, అయితే ప్రస్తుతం వీరి కెరీర్ ఫేడవుట్ దిశగా అడుగులు వేస్తోందా అనే సందేహాలు సినీ విశ్లేషకుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ బలంగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ పరిస్థితిని పరిశీలిస్తే, ఆమె గత కొన్నేళ్లుగా కొత్త ప్రాజెక్ట్‌లకు సంతకం చేయకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్ 2' దాదాపు 345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి భారీ విజయంగా నిలిచినప్పటికీ, ఆ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఐష్ మరే ఇతర కొత్త ప్రాజెక్ట్‌ను కూడా అధికారికంగా ప్రకటించలేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలయ్యాక అత్యంత జాగరూకతతో కథలను ఎంచుకుంటూ వచ్చిన ఐశ్వర్య, ప్రస్తుతం కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో మెరవడం లేదా వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపార ప్రకటనలకే పరిమితమయ్యారని విశ్లేషణలు చెబుతున్నాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ నుంచి కేవలం బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే వార్తల్లో నిలవడం ఆమె అభిమానులను కలవరపెడుతోంది.
ఇది కూడా చదవండి: గ్లామర్ రోల్స్ నుంచి రియల్ లైఫ్ లెజెండ్స్ వైపు: హీరోయిన్ జిందాబాద్!

మరోవైపు బాలీవుడ్ బెబో కరీనా కపూర్ కెరీర్ గ్రాఫ్ కూడా ఆశించిన స్థాయిలో సాగడం లేదనేది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వివాహం, ఇద్దరు పిల్లల జన్మ తర్వాత కూడా వరుస అవకాశాలతో దూసుకుపోయిన కరీనాకు, ఇటీవల థియేటర్లలో మినిమం వసూళ్లు రాబట్టడం కూడా అత్యంత క్లిష్టంగా మారింది. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ దర్శకత్వంలో, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలసి కరీనా తాజా చిత్రం 'దాయ్రా' బాక్సాఫీస్ వద్ద ఘోర డిజాస్టర్‌గా మిగిలింది. దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కనీసం 20% రికవరీ కూడా సాధించలేక డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దీనికంటే ముందు వచ్చిన 'ది క్రూ' సాధించిన వసూళ్లను పక్కన పెడితే, సోలో లీడ్‌గా కరీనా మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితికి కేవలం ఫ్లాప్‌లు మాత్రమే కారణం కాదని, పరిశ్రమలోని కొత్త మార్పులు కూడా ఒక ముఖ్య కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

చిత్రసీమలోకి కొత్త తరం కథానాయికల రాక పెరగడం, వయస్సుకు తగ్గ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడంలో సీనియర్ హీరోయిన్లు వెనుకబడడం కూడా వీరికి అవకాశాలు తగ్గడానికి దోహదం చేస్తున్నాయి. సాధారణంగా సీనియర్ బ్యూటీలు ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో ముందుకు రావాల్సి ఉంటుంది, కానీ వీరి మార్కెట్ పరిధి క్రమంగా తగ్గుతుండడంతో నిర్మాతలు 30 నుండి 50 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు సైతం ముందుకు రావడం లేదు. ఈ విధమైన పరిణామాల మధ్య ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ వంటి సీనియర్ తారలు తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను మళ్లీ ఎలా నిర్మించుకుంటారో వేచి చూడాల్సిందే! ఏది ఏమైనా కాశ్మిరీ యాపిల్ కంటే అందమైన సోయగం, సొగసుతో బాలీవుడ్ ని ఏలిన మాట వాస్తవం.





