Home

»

Latest News

 ఆకాశంలో ఒక తార రివ్యూ!

Nov 20, 2026 10:04AM

సినిమా పేరు:  ఆకాశంలో ఒక తార
న‌టీన‌టులు: సాత్విక వీరవల్లి, దుల్కర్ సల్మాన్, శృతి హాసన్, రుహాణి శర్మ, శ్వాసిక, నాజర్, మురళి శర్మ  తదితరులు 
సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: ప్రవీణ్ కే ఎల్
మ్యూజిక్:జివి ప్రకాష్ కుమార్ 
నిర్మాత‌లు: గుణ్ణం గంగరాజు, అల్లు అరవింద్,అశ్వనీదత్  
బ్యానర్స్: లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్  
దర్శకత్వం: పవన్ సాదినేని 
రిలీజ్ డేట్ : నవంబర్ 20, 2026 

ప్రచార చిత్రాలతో క్రేజ్ సంపాదించుకుంది ఆకాశంలో ఒక తార. ఎంతలా అంటే మేకర్స్  రిలీజ్ ముందు రోజు ప్రీమియర్స్ ప్రదర్శిస్తే ఎంత బాగుండు అనేంతలా. మరి ప్రీమియర్స్ ప్రదర్శించారు. మూవీ ఎలా ఉందో చూద్దాం. 


కథ
కల్పన( సాత్విక వీరవల్లి) స్కూల్ చదివే వయసు నుంచే ఆస్ట్రోనట్(వ్యోమగామి) అయ్యి అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంటూ ఉంటుంది. నిర్మలమైన మనసు, సాత్వికురాలు. ఇంటి ముందు వేసే ముగ్గు కూడా ఆకాశంతో పాటు నక్షత్రాలు లాగా వేస్తుంటుంది.  చదువులో టాపర్. అందరి కంటే వేరేలా ఆలోచించడం తన బలం. ఎంతమంది ఎగతాళి చేసినా, నవ్వుకున్నా మన గమ్యం అంటే ఏంటో చెప్పకపోతే దారి ఎవరైనా ఎలా చూపిస్తారు అనుకునే స్వభావం కూడా. తండ్రి శివయ్య తాగుబోతు. కూతురు అంటే ఆడపిల్ల కదా అని చిన్న చూపు. 10 th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ కూడా రాయనివ్వనంత  కఠినాత్ముడు. కల్పనకి  తల్లి గంగ  సపోర్ట్. కృష్ణ( దుల్కర్ సల్మాన్) ఒక మెకానిక్. సొంతంగా కారు కొనుక్కొని డ్రైవర్ అవ్వాలనేది కల. కృష్ణ, కల్పనకి పెళ్లి జరుగుతుంది. అప్పుడు కల్పన వయసు 16 ఏళ్ళు. దీంతో కృష్ణ షాక్ అవుతాడు. మరి కల్పన తన లక్ష్యం చేరుకోవడానికి వివాహబంధం అనేది అన్యాయం చేసిందా? సాయపడిందా? ఒక వేళ సాయపడితే సామాన్య మెకానిక్ భార్య తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? ఆ చేరుకునే ప్రాసెస్ లో స్వార్ధం, పంతం, త్యాగం అనే మూడు శక్తులు కల్పన జీవితంలో ఎలా మహత్తర శక్తులుగా ఉన్నాయనేదే  ఆకాశంలో ఒక తార.

ఎనాలసిస్ 
మూవీ స్టార్టింగ్ నుంచే మన మైండ్ లో ఆడపిల్లని తక్కువ అంచనా వెయ్యకూడదు.. అనుకున్నది సాధించడంలో ఎవరికీ తీసిపోదు అనే మాట మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. పైగా మన ఇంట్లో ఆడపిల్ల ఉంటె నువ్వు ఏం అనుకుంటున్నావో చెప్పు నీ వెనక మేము ఉన్నామని ఇంట్లో వాళ్ళు అంటారు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే రివర్స్ స్క్రీన్ ప్లే తో గుజరాత్ రాష్ట్రంలో ట్రక్ డ్రైవర్ గా పని చేస్తున్న కృష్ణ పాయింట్ లో నడిచిన కల్పన చైల్డ్ ఎపిసోడ్ సూపర్. గుజరాత్ లో కృష్ణ, బిజిలి( రుహాణి శర్మ) శర్మ సీన్స్ కూడా సూపర్.

ఆ తర్వాత కల్పన, కృష్ణ పెళ్లి సీన్స్, కృష్ణ అక్క( శ్వాసిక) సీన్స్ బాగున్నాయి. కాకపోతే కల్పన లక్ష్యాన్ని కృష్ణ తెలుసుకునే ప్రాసెస్ ని టెన్షన్ బిల్డప్ చేస్తూ  లెన్త్ లో చూపించాల్సింది. ఎందుకంటే కథకి ఈ పాయింట్ నే కీలకం కాబట్టి ప్రేక్షకులు కూడా అయ్యో కల్పన లక్ష్యం ఇప్పుడెలా అని అనుకునేవారు. కల్పన, కృష్ణ హైదరాబాద్ రావడం, కల్పన కాలేజీ లో చేరడం, తన ఎడ్యుకేషన్, ఆ తర్వాత కేరళలో ఐఐటి క్యాంపస్ ఇలా అన్ని సీన్స్ బాగున్నాయి. కానీ అంతరిక్షం ప్రయోగం చేసే అవకాశం అనేది చాలా కష్టంతో రావాల్సింది అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది . సెకండ్ హాఫ్ చూసుకుంటే కృష్ణ, కల్పన మధ్య కొత్త పార్స్యానికి సంబంధించిన కథ రన్ అయ్యింది. అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్స్ ని తయారు చేసే స్కై వే యజమాని రోహిణి పరిచయం కాగానే సీన్స్ అన్ని చాలా గమ్మత్తుగా, ఫ్రెష్ గా వచ్చాయి.

ముఖ్యంగా కృష్ణ, రోహిణి, కల్పన మధ్య వచ్చిన సీన్స్. కృష్ణ, రోహిణి మద్యం తాగే సీన్స్ అయితే బాగున్నాయి.తన లక్ష్యం వద్దనుకుని  DRDO [డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్] లో జాబ్ చేస్తున్న కల్పనని కృష్ణ మళ్ళీ  తన లక్ష్యం వైపు వచ్చేలా చేయడం అనే ప్రాసెస్ ని హెవీ గా చూపించాల్సింది. కల్పనకి కృష్ణ దూరమవ్వడం అనే ఎపిసోడ్ తో పాటు ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ సూపర్ గా ఉన్నాయి.

నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు   
కల్పన గా సాత్విక వీరవల్లి దిష్టి పెట్టేంత రేంజ్ లో మెస్మరైజ్ చేసింది. అసలు ఈ క్యారక్టర్ చెయ్యడం కోసమే తను ఈ భూమ్మీదకి వచ్చిందా అని అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నటనకి సంబంధించిన అన్ని వేరియేషన్స్ లో తన హవా సుస్పష్టం. కృష్ణ గా దుల్కర్ సైతం అంతే.. తన కెరీర్ లో ఆకాశంలో ఒక తార మరో మైలురాయి. కొన్నేళ్ల పాటు మంచి మొగుడు ఎవరు అంటే దుల్కర్ అని చెప్తారు. రోహిణి గా శృతి హాసన్ తన పెర్ఫార్మ్ తో మూవీకి మరో తారలా నిలిచింది. మోడరన్ అండ్ మంచి తనం కలగలిపిన ఒక ఎడ్యుకేట్, ప్రొఫిషినల్ గా పర్ఫెక్ట్ గా ఉండే అమ్మాయిలు  ఎలా ఉంటారో తన నటన ద్వారా చాటి చెప్పింది. నాజర్, మురళి శర్మ, కల్పన తల్లి తండ్రులు తో పాటు మిగతా అందరూ కూడా తమ క్యారెక్టర్స్ మాత్రమే కనపడేలా మెప్పించారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ అదనపు బలం. పవన్ సాదినేని దర్శకుడిగా ఇంకో మెట్టు పైకి ఎక్కాడు. షాట్ సెలక్షన్ సూపర్.  రైటర్స్ ఇంకొంచం మెరుగులు దిద్దాల్సింది. గుణ్ణం గంగరాజు, అల్లు అరవింద్, అశ్వని దత్ నుంచి వచ్చిన ప్రొడక్షన్ వాల్యూస్ మరో అతి పెద్ద బలం.


బలాలు
1 . కథ
2 . సాత్విక, దుల్కర్, శృతి హాసన్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్
3 . డైరెక్షన్ 
4 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ 


చివరిగా చెప్పాలంటే మూవీ చూస్తున్నంత సేపు మెస్మరైజ్ అవుతూనే ఉంటాం. అయ్యాక ఆడవాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలని డిసైడ్ అవుతాం.


రేటింగ్ 2 .75 /5    
                                                                                                          అరుణాచలం 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com