
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'గాడ్‌ఫాదర్' మూవీలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఓ స్పెషల్ రోల్ చేయనున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. మలయాళం బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్'కు 'గాడ్‌ఫాదర్' రీమేక్. ఒరిజినల్‌లో మోహన్‌లాల్ చేసిన టైటిల్ రోల్‌ను తెలుగు రీమేక్‌లో చిరంజీవి చేస్తున్నారు. అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన స్పెషల్ క్యారెక్టర్‌ను సల్మాన్ చేస్తున్నాడు. ముంబై సమీపంలోని కర్జత్‌లో ఉన్న స్టూడియోలో చిరంజీవి, సల్మాన్‌పై సన్నివేశాలను ఈ నెల 12 నుంచి చిత్రీకరిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ 'గాడ్‌ఫాదర్' సెట్స్‌పై అడుగుపెట్టారని తెలియజేస్తూ, ఆయనతో దిగిన ఫొటోను చిరంజీవి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసుకున్నారు. "భాయ్ సల్మాన్ ఖాన్‌కు 'గాడ్‌ఫాదర్' సెట్స్ మీదకు స్వాగతం. మీ ఎంట్రీ ప్రతి ఒక్కరికీ శక్తినిచ్చింది. ఎగ్జయిట్‌మెంట్ మరో లెవల్‌కు వెళ్లింది. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా చాలా ఉత్తేజకరం. ఆడియెన్స్‌కు మీ ప్రెజెన్స్ మ్యాజికల్ కిక్‌ను ఇస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు." అని రాసుకొచ్చారు చిరంజీవి. ఫొటోలో సల్మాన్‌కు పుష్పగుచ్ఛాన్ని ఇస్తున్నారు చిరంజీవి. అది తొలిరోజు సెట్స్‌పై సల్మాన్‌కు ఆహ్వానిస్తూ తీసిన ఫొటో అని తెలుస్తోంది.
ఈ షూటింగ్ నిజానికి జనవరిలో జరగాల్సింది కానీ చిరంజీవి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆలస్యమైంది. ఆ తర్వాత సల్మాన్ 'టైగర్ 3' ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌తో బిజీ అయ్యాడు. ఇప్పుడు అన్నీ కుదరడంతో కర్జత్‌లోని ఎన్‌డీ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుతున్నారు. ఈ షూటింగ్‌లో కొన్ని యాక్షన్ సీన్స్‌తో పాటు క్లైమాక్స్ సీన్‌ని తీస్తున్నారు.
మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న 'గాడ్‌ఫాదర్'లో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై సురేఖ సమర్పిస్తోన్న ఈ మూవీని సూపర్‌గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.






