Home

»

Latest News

ఆ లెక్కలేసుకొని 'ఆర్ఆర్ఆర్' తీయలేదు.. అలాంటి సినిమా చేయను

Mar 15, 2022

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ సినిమాలో నటిస్తే ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ని మెప్పించేలా సినిమా తీయడం కత్తి మీద సాము లాంటిది. తమ హీరోని తక్కువ చేసి చూపించినట్లు ఏ మాత్రం అభిమానులకు అనిపించినా లేనిపోని తలనొప్పులు వస్తాయి. దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' తర్వాత సమానమైన ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చేస్తున్నామని ప్రకటించిప్పుడు ఇదే ప్రశ్న అందరిలో మెదిలింది. ఇప్పటిదాకా విడుదలైన టీజర్స్, ట్రైలర్ ని బట్టి చూస్తే ఇద్దరిని సమానంగా చూపించారనే అనిపిస్తోంది. మరి సినిమాలో నిజంగానే ఇద్దరినీ సమానంగా చూపించారా అంటే.. రాజమౌళి మాత్రం తాను అసలు అలాంటి లెక్కలు వేసుకోలేదని తెలిపారు.

స్టార్ డమ్, ఫ్యాన్ బేస్ ఇలాంటి లెక్కలు పట్టించుకుని సినిమా తీయలేదని రాజమౌళి అన్నారు. మాములుగా ఇద్దరు స్టార్స్ ఉంటే.. ఇద్దరికీ ఎంత స్క్రీన్ స్పేస్ ఉంది, ఒక్కొక్కరు ఎన్ని నిముషాలు కనిపిస్తున్నారు, ఎవరెవరికి ఎన్ని ఫైట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎన్ని పంచ్ లు కొట్టారు.. ఈ లెక్కలలోకి వెళ్తారు. కానీ తాను ఇవి పట్టించుకోలేదని రాజమౌళి తెలిపారు. తన కథ ప్రకారం ఆడియన్స్ కి ఇద్దరి మీద ఒకే రకమైన ఫీలింగ్ కలగాలి, రెండు పాత్రలకు ఈక్వల్ గా కనెక్ట్ కావాలి.. అలా జరగకపోతే తన ఫెయిల్ అయినట్లే అని రాజమౌళి చెప్పుకొచ్చారు.  ఆ పరంగా మాత్రం సినిమాలో రెండు పాత్రలకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుందని, సినిమా చూస్తున్నప్పుడు ఇద్దరి ఇంట్రడక్షన్స్ పూర్తి కాగానే స్టార్స్ అనే విషయం మర్చిపోయి ఆ రెండు పాత్రలకి ఆడియన్స్ కనెక్ట్ అవుతారని అన్నారు. ఫ్యాన్స్ లెక్కలు వేసుకొని సినిమా తీస్తే హృదయం లేని ఫాల్స్ సినిమా చేసినట్లు అని, అలాంటి సినిమా తాను చేయనని రాజమౌళి చెప్పారు.

తాను రాసుకున్న రామ్ పాత్రకి చరణ్, భీమ్ పాత్రకి తారక్ పర్ఫెక్ట్ అని రాజమౌళి అన్నారు. రామ్ పాత్రలో ఎంత అగ్నినైనా గుండెల్లో దాచుకునే స్థిత ప్రజ్ఞత ఉంటుందని, అది తనకి చరణ్ లో కనిపించిందని తెలిపారు. ఎంత పెద్ద బ్యాడ్ న్యూస్ వచ్చినా చరణ్ కృంగి పోడు, పొంగి పోడు.. తొణకకుండా ఉంటాడని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇక భీమ్ పాత్ర విషయానికొస్తే.. అమాయకుడు అని, తన ఫీలింగ్స్ ని దాచుకోడని అందుకే ఆ పాత్రకి తారక్ ని తీసుకున్నానని రాజమౌళి చెప్పారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com