
చిన్న హీరోయిన్స్ నుంచి స్టార్స్ హీరోయిన్స్ వరకు తాము కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని ఎందరో చెప్పారు. అయితే సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే కొత్త వాళ్ళు మాత్రమే ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటారన్న అభిప్రాయం ఉంది. అయితే ఈ అభిప్రాయం తప్పు అని మంచు లక్ష్మి అంటోంది. కెరీర్ స్టార్టింగ్ లో తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
నాలుగు దశాబ్దాల సినీ అనుభవం ఉన్న డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి.. తాను కూడా కాస్టింగ్ కౌచ్, బాడీ షేమింగ్ దాటే ఇక్కడివరకు వచ్చానని చెప్పడం షాకింగ్ గా మారింది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తండ్రి స్టార్ కాబట్టి కాస్టింగ్ కౌచ్ అనేది ఉండదు అనుకున్నానని, కానీ తాను కూడా కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పింది. బ్యాంకింగ్, ఐటీ ఇలా అన్ని చోట్లా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని తెలిపింది. విభిన్న రంగాలలో ఇలాంటివి ఎదుర్కొన్న తన ఫ్రెండ్స్ ఎందరో ఉన్నారని చెప్పుకొచ్చింది.
అంతేకాదు, తాను బాడీ షేమింగ్ కూడా ఎదుర్కొన్నానని మంచు లక్ష్మి తెలిపింది. బాడీ షేమింగ్ రోజురోజుకి పెరిగిపోతుందని, దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. లావుగా ఉన్నప్పుడు లావుగా ఉన్నావని, సన్నబడితే సన్నగా ఉన్నావని అంటుంటారు. అందరూ అందరినీ సంతోషపెట్టలేరు. మనకు నచ్చినట్టుగా మనం ఉండాలి.. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి అని మంచు లక్ష్మి పేర్కొంది. బాడీ షేమింగ్, కాస్టింగ్ కౌచ్ ఇవేవీ మనల్ని ఆపకూడదు. మనం చేయాలనుకున్నది చేయాలి.. సాధించాలనుకున్నది సాధించాలి అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.






