
మీరంతా రెండేసి విడుదల తేదీలను ప్రకటిస్తుంటే మేం ఏడు ప్రకటించకూడదా అంటూ 'అంటే సుందరానికీ' మూవీ టీమ్ ఏడు రిలీజ్ డేట్స్ ని ప్రకటించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మూవీ టీమ్ ఏడు తేదీల్లో ఒక దాన్ని ఫిక్స్ చేసింది. రేపు(ఫిబ్రవరి 24) నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు కావడంతో ఈరోజు సాయంత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికీ'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ సినిమా పోస్టర్స్, ప్రమోషన్స్ మొదటి నుంచి విభిన్నంగా ఉంటున్నాయి. ఈ ఆవకాయ సీజన్(సమ్మర్)లో రాబోతున్నాం అంటూ ఏప్రిల్ 22 నుంచి జూన్ 10 వరకు ఏడు విడుదల తేదీలను ప్రకటించి ఆశ్చర్యపరిచిన మూవీ టీమ్ తాజాగా రిలీజ్ డేట్ ని లాక్ చేసింది. జూన్ 10 న 'అంటే సుందరానికీ' సినిమాని విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

రేపు నాని పుట్టినరోజు కావడంతో 'యువ సుందరుడు బర్త్ డే హోమం' అంటూ విభిన్న ప్రమోషన్స్ షురూ చేసింది మూవీ టీమ్. విడుదల తేదీ ప్రకటనలో కూడా మేకర్స్ కొత్తదనం చూపించారు. "అంటే... మా వాడి జాతకం ప్రకారం 'Barthhday Homam' జరిగిన 108 రోజులు వరకు బయటికి రాకూడదన్నారు, అందుకే JUNE 10న మిమ్మల్ని నవ్వించడానికి థియేటర్స్ కి వస్తున్నాడు. Happy Birthday Sundar, Blockbuster ప్రాప్తిరస్తు" అని ట్వీట్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా పోస్టర్ ని పంచుకుంది.
నాని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ ని విడుదల చేశారు. అందులో సుందరం(నాని)కి గండాలు ఉన్నాయని, అతని హోమాలు చేయిస్తూ ఉంటారు. ఆ హోమాలతో విసిగిపోయిన సుందరం 'ఇంకోసారి గండాలు, హోమాలు అన్నారంటే.. మొహం పగిలిపోతుంది' అంటూ నవ్వులు పూయించాడు.
ఈ గ్లింప్స్ ని ట్విట్టర్ లో షేర్ చేసిన నాని "మొహం పగిలిపోతుంది" అని ట్వీట్ చేశాడు. ఆ డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.







