Home

»

Latest News

కృష్ణంరాజు తొలి చిత్రం `చిల‌కా గోరింకా`కి 56 ఏళ్ళు!  

Jun 10, 2022 4:34PM

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు కెరీర్ లో జూన్ 10కి ఎంతో ప్ర‌త్యేక స్థానం ఉంది. ఎందుకంటే.. 56 ఏళ్ళ క్రితం స‌రిగ్గా ఇదే రోజున ఆయ‌న న‌టించిన తొలి చిత్రం `చిల‌కా గోరింకా` జ‌నం ముందు నిలిచింది. అగ్ర ద‌ర్శ‌కుడు కె. ప్ర‌త్య‌గాత్మ స్వ‌యంగా నిర్మించి మ‌రీ తెర‌కెక్కించిన ఈ సినిమాలో కృష్ణంరాజుకి జంట‌గా అప్ప‌టి అగ్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రైన కృష్ణ‌కుమారి న‌టించ‌డం వార్త‌ల్లో నిలిచింది. అలాగే ఎస్వీ రంగారావు, అంజ‌లీ దేవి,  ర‌మ‌ణా రెడ్డి, ప‌ద్మ‌నాభం, నిర్మ‌ల‌మ్మ వంటి ప్ర‌ముఖ తారాగ‌ణం ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు. అదే విధంగా, శ్రీ శ్రీ (శ్రీ‌రంగం శ్రీ‌నివాస రావు) వంటి మేటి ర‌చ‌యిత ఈ చిత్రంలోని పాట‌ల‌కి ప‌ద‌ర‌చ‌న చేయ‌డం మ‌రో విశేషం. అంతేకాదు.. ఇదే సినిమా  ప్ర‌ముఖ హాస్య న‌టి ర‌మాప్ర‌భకి కూడా మొద‌టి చిత్రం కావ‌డం.. కృష్ణంరాజుకి చెల్లెలిగా ఆమె న‌టించ‌డం ఇంకో విశేషం.

`చిల‌కా గోరింకా` చిత్రం గురించి సింపుల్ గా చెప్పాలంటే.. జీవితానికి అర్థం, ప‌ర‌మార్థం చెప్పే ప్ర‌య‌త్నంలా తెర‌కెక్కిన ఈ సినిమా, మూడు జంట‌ల (ఎస్వీఆర్ - అంజ‌లీదేవి, కృష్ణంరాజు - కృష్ణ‌కుమారి, ప‌ద్మ‌నాభం - ర‌మాప్ర‌భ‌) ప్రేమానురాగాల‌కు వెండితెర రూపం.  

ఇక పాట‌ల విష‌యానికి వ‌స్తే, దిగ్గ‌జ స్వ‌ర‌క‌ర్త సాలూరి రాజేశ్వ‌ర‌రావు సంగీత‌మందించిన ఈ చిత్రంలో.. ``ఎరుపెక్కెను చ‌క్క‌ని నీ చెక్కిలి``, ``నా రాణి క‌నుల‌లోనే``, ``నేనే రాయంచ‌నై``, ``పాప క‌థ విను`` అంటూ మొద‌ల‌య్యే గీతాల‌న్నీ ఆక‌ట్టుకున్నాయి.  `ద్వితీయ ఉత్త‌మ చిత్రం` విభాగంలో `నంది` పుర‌స్కారం ద‌క్కించుకున్న `చిల‌కా గోరింకా`..  1966 జూన్ 10న విడుద‌లైంది. అంటే, నేటితో కృష్ణంరాజు న‌ట‌ప్ర‌స్థానానికి 56 వ‌సంతాలు పూర్త‌య్యాయ‌న్న‌మాట‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com