
మెగాస్టార్ చిరంజీవిలోని నటుడ్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాల్లో `చిరంజీవి` ఒకటి. కన్నడ చిత్రం `నానే రాజా` (1984) (రవిచంద్రన్, అంబిక, అంబరీశ్, జై జగదీశ్) ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో టైటిల్ రోల్ లో చిరంజీవి నటించగా.. అతనికి జోడీగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అభినయించింది. విజయశాంతికి చెల్లెలుగా, అంధురాలిగా భానుప్రియ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో మురళీ మోహన్, కైకాల సత్యనారాయణ, రంగనాథ్, నూతన్ ప్రసాద్, సుత్తి వేలు, సుత్తి వీరభద్రరావు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. మాతృకకి దర్శకత్వం వహించిన సీవీ రాజేంద్రన్.. తెలుగు వెర్షన్ ని కూడా డైరెక్ట్ చేయడం విశేషం. కథ విషయానికి వస్తే.. కన్నతండ్రిని కాపాడుకోవడానికి తన ప్రాణాన్నే బలియిచ్చే `చిరంజీవి` అనే ఓ యువకుడి కథే `చిరంజీవి` చిత్రం.
దిగ్గజ సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ఇందులోని ``రాజాగా వెలుగు``, ``ఇరుక్కుపోయావమ్మో`` వంటి గీతాలు ఆకట్టుకున్నాయి. అజయ్ క్రియేషన్స్ పతాకంపై కె.లక్ష్మీనారాయణ, కె.వి. రామారావు నిర్మించిన `చిరంజీవి`.. 1985 ఏప్రిల్ 18న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 37 వసంతాలు పూర్తిచేసుకుంది.






