
నటసింహం నందమూరి బాలకృష్ణ - శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ - `భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్` ఎస్. గోపాల్ రెడ్డి - స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను భలేగా అలరించాయి. వాటిలో `ముద్దుల క్రిష్ణయ్య` ఒకటి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మాస్ ఎంటర్టైనర్ లో టైటిల్ రోల్ లో బాలయ్య తనదైన అభినయంతో మురిపించారు. బాలకృష్ణకి జోడీగా విజయశాంతి, రాధ నటించిన ఈ చిత్రంలో ఎస్. వరలక్ష్మి, గొల్లపూడి మారుతీరావు, కేకే శర్మ, కల్పనా రాయ్, వై. విజయ, నిర్మలమ్మ, టెలిఫోన్ సత్యనారాయణ, జుట్టు నరసింహం, థమ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. భార్గవ్ ఆర్ట్స్ యూనిట్ కథను అందించగా.. గణేశ్ పాత్రో సంభాషణలు సమకూర్చారు.
కేవీ మహదేవన్ అందించిన బాణీలకు సి. నారాయణ రెడ్డి సాహిత్యమందించారు. ఇందులోని ``సురుచిర సుందరవేణి`` అంటూ సాగే పాట ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలవగా.. ``క్రిష్ణయ్య దూకాడు``, ``ఒంగోలు గిత్త`` (రెండు వెర్షన్స్), ``ఏం చేయను``, ``ఇదిగో చెట్టు చాటుగా`` గీతాలు కూడా రంజింపజేశాయి. 1986 ఫిబ్రవరి 28న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన `ముద్దుల క్రిష్ణయ్య`.. నేటితో 36 వసంతాలు పూర్తిచేసుకుంది.






