
ప్రతిష్టాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికపై టాలీవుడ్ తన సత్తా చాటింది. ముఖ్యంగా ఉత్తమ బాలల చిత్రాల విభాగంలో తెలుగు సినిమా సాధించిన అరుదైన విజయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, 2024 లో విడుదలైన ఒక చిన్న సినిమా జాతీయ స్థాయిలో భారీ సంచలనాన్ని సృష్టించింది. అదే నివేదా థామస్, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన "35 చిన్న కథ కాదు". 72వ జాతీయ అవార్డుల్లో ఈ చిత్రం 'ఉత్తమ బాలల చిత్రం' (Best Children's Film) కేటగిరీలో జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకుంది.
తెలుగు సినిమా చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే, ఇప్పటివరకు ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న సినిమాలు కేవలం రెండంటే రెండే కావడం విశేషం. 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా నటించిన పౌరాణిక చిత్రం "బాల రామాయణం" తొలిసారిగా ఈ కేటగిరీలో నేషనల్ అవార్డు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఆ తర్వాత 27 సంవత్సరాల పాటు ఒక్క సినిమా కూడా ఆ ఘనతను సాధించలేకపోయింది. ఇన్నాళ్లకు దర్శకుడు నంద కిశోర్ ఈమని తెరకెక్కించిన "35 చిన్న కథ కాదు" చిత్రం ఆ సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేసింది.
ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబంలో సున్నా మార్కులు తెచ్చుకునే పిల్లాడు, మ్యాథ్స్ సబ్జెక్టులో పాస్ మార్కులు అయిన 35 మార్కులు సాధించడానికి పడే తపనను, అతని తల్లి పడే ఆరాటాన్ని ఎంతో సహజంగా, భావోద్వేగాలతో ఈ సినిమాలో ఆవిష్కరించారు.
కమర్షియల్ లెక్కలు, భారీ బడ్జెట్లతో సంబంధం లేకుండా, మనసుకు హత్తుకునే మంచి కథతో సినిమా తీస్తే జాతీయ స్థాయిలో ఇలాంటి అరుదైన గౌరవం దక్కుతుందని ఈ చిత్రం నిరూపించింది. టాలీవుడ్ గర్వించదగ్గ రీతిలో 1997 లో వచ్చిన 'బాల రామాయణం' సరసన 2024 లో '35 చిన్న కథ కాదు' నిలిచి చరిత్ర సృష్టించింది.
ఈ సినిమాకు కేవలం ఉత్తమ బాలల చిత్రం అవార్డే కాకుండా, మరో అద్భుతమైన జాతీయ అవార్డు కూడా లభించింది. సినిమాలో తన సహజ నటనతో మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ పోతుల 'ఉత్తమ బాలనటుడు' (Best Child Artist) గా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.
National Film Awards, Best Children's Film, Bala Ramayanam, 35 Chinna Katha Kaadu






