Home

»

Latest News

ఏప్రిల్ 28.. 3 ఇండ‌స్ట్రీ హిట్స్‌ను ఇచ్చిన డేట్‌

Apr 28, 2020 3:53PM

 

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో హిట్స్ ఉన్నాయి.. సూపర్ హిట్స్ ఉన్నాయి.. అలాగే బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే, ఇండస్ట్రీ హిట్స్ మాత్రం వేళ్ళమీద లెక్కపెట్టుకోదగ్గవే. అలాంటి ఇండస్ట్రీ హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తేదీ ఒకటుంది. అదే.. ఏప్రిల్ 28. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాలు.. వేర్వేరు సంవత్సరాల్లో ఇదే తేదీన విడుదలై అఖండ విజయం సాధించాయి, ఇండస్ట్రీ హిట్స్‌గా నమోదయ్యాయి. వసూళ్ళపరంగానూ, కేంద్రాలపరంగానూ గత రికార్డులను భూస్థాపితం చేశాయి. వేర్వేరు జాన‌ర్స్‌లో తెర‌కెక్కి తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆ చిత్రాలే.. ‘అడవి రాముడు’ (1977), ‘పోకిరి’ (2006), ‘బాహుబలి 2: ది కంక్లూజ‌న్‌’ (2017).  

1977 ఏప్రిల్ 28.. టాలీవుడ్ చరిత్రలో సెన్సేషనల్ కాంబినేషన్‌కి పునాది పడిన రోజు. పలు ఘ‌న‌విజయాలకు చిరునామాగా నిలిచిన మహానటుడు నందమూరి తారక రామారావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కలయికలో రూపొందిన మొట్టమొదటి సినిమా ‘అడవి రాముడు’ వెండితెరపై వినోదాలు పంచిన రోజు. కన్నడ చిత్రం ‘గంధద‌గుడి’ ఆధారంగా రూపొందిన ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ.. అప్పట్లో కనీవినీ ఎరుగని రీతిలో కాసుల వర్షం కురిపించింది. అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది. ఆ సినిమా చూడ్డానికి జ‌నం బ‌ళ్లు క‌ట్టుకొని తండోప‌తండాలుగా త‌ర‌లి సినిమా హాళ్ల‌ను ముంచెత్తేవారు. గీత ర‌చ‌యిత‌గా వేటూరిలోని మ‌రో కోణాన్ని చూపించిన సినిమా కూడా ఇదే. 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హ‌రీ' పాట సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్‌, జ‌య‌ప్ర‌ద జంట‌పై తీసిన ఈ సాంగ్‌.. డ్యూయెట్స్‌లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది.

కట్ చేస్తే.. సేమ్ ఏప్రిల్ 28. జస్ట్ ఇయర్ ఛేంజ్.. ఈసారి 2006. పండుగాడుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు విజృంభించిన రోజు. ‘పోకిరి’గా పలకరించిన రోజు. అగ్రశ్రేణి దర్శకుడు పూరి జగన్నాథ్ తీర్చిదిద్దిన ఈ యాక్షన్ డ్రామా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ రికార్డు స్థాయి కలెక్షన్స్‌ని కొల్లగొట్టింది. సెంటర్స్‌పరంగానూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. అటు మహేశ్ ఖాతాలోనూ, ఇటు పూరి ఖాతాలోనూ తొలి ఇండస్ట్రీ హిట్‌గా నమోదైంది. అలాగే తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది. అన్ని చోట్లా విజయకేతనం ఎగురవేసింది. పూరి మార్క్ డైలాగ్స్ ఈ సినిమాలో మ‌రో రేంజిలో పాపుల‌ర్ అయ్యాయి. "ఎవ‌రు కొడితే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే.. పండుగాడు" అంటూ మ‌హేశ్ చెప్పిన డైలాగ్ ఐక‌నిక్ డైలాగ్‌గా నిలిచిపోయింది. అలాగే మ‌హేశ్, ఇలియానా జోడీకి ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌లికారు.

మళ్ళీ కట్ చేస్తే.. 2017 ఏప్రిల్ 28. ఈసారి టాలీవుడ్ చరిత్రలోనే కాదు ఇండియన్ హిస్టరీలోనే సెన్సేషన్ క్రియేట్ అయిన రోజు. ‘బాహుబలి’ సిరీస్‌లో రెండో చిత్రంగా వచ్చిన ‘బాహుబలి 2: ది కంక్లూజ‌న్‌’ రిలీజైన రోజు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా వారిద్దరికీ హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ ఫోక్‌లోర్ మూవీ తెలుగునాటే కాదు జాతీయస్థాయిలో అద్భుతాలు సృష్టించింది. ఇండియన్ హిస్టరీలోనే ఇండస్ట్రీ హిట్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటు రాజ‌మౌళిని టాప్ డైరెక్ట‌ర్‌గా, ఇటు ప్ర‌భాస్‌ను పాన్‌-ఇండియా స్టార్‌గా నిలిపింది. అంతేకాదు.. దేవ‌సేన‌గా అనుష్క‌కు వ‌చ్చిన కీర్తి కానీ, భ‌ల్లాల‌దేవ‌గా రానాకు వ‌చ్చిన పేరు కానీ సామాన్య‌మైన‌వి కావు.

సో.. ఏప్రిల్ 28 ఏ విధంగా చూసినా తెలుగు ఇండస్ట్రీకి మెమ‌రబుల్ డేట్ అనే చెప్పాలి. మరి, మున్ముందు కూడా ఇదే తేదీన మరిన్ని ఇండస్ట్రీ హిట్స్ చేరుతాయేమో చూద్దాం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com