Home

»

Latest News

బాల‌య్య `శ్రీ‌రామ‌రాజ్యం`కి ప‌దేళ్ళు!

Nov 17, 2021 10:55AM

కేవ‌లం సాంఘిక చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా.. త‌న తండ్రి, మ‌హాన‌టుడు నందమూరి తార‌క రామారావు త‌ర‌హాలో పౌరాణిక‌, జాన‌ప‌ద, చారిత్ర‌క క‌థాంశాల‌తో రూపొందిన సినిమాల్లోనూ న‌టించి మెప్పించిన వైనం నట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ సొంతం.  కాగా, తెలుగునాట మొట్ట‌మొద‌టి వజ్రోత్స‌వ చిత్రంగా రికార్డులెక్కిన ఎన్టీఆర్ `ల‌వ‌కుశ‌` (1963) స్ఫూర్తితో బాల‌య్య న‌టించిన పౌరాణిక చిత్రం `శ్రీ‌రామ‌రాజ్యం`.  దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు బాపు రూపొందించిన ఈ సినిమాలో శ్రీ‌రాముడిగా ద‌ర్శ‌న‌మిచ్చి అల‌రించారు బాల‌కృష్ణ‌. ఉత్త‌ర రామాయ‌ణంలోని సీతాప‌రిత్యాగ‌ము, ల‌వ‌కుశుల జ‌న‌నం, శ్రీ‌రాముడితో ల‌వ‌కుశ‌ల పోరాటం, సీతారాములు వైకుంఠం చేరుట‌ వంటి ప్ర‌ధానాంశాల‌తో `శ్రీ‌రామ‌రాజ్యం` తెర‌కెక్కింది. ఇందులో సీత‌గా న‌య‌న‌తార క‌నిపించ‌గా.. వాల్మీకిగా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, ల‌క్ష్మ‌ణుడుగా శ్రీ‌కాంత్, కౌస‌ల్యా దేవిగా కేఆర్ విజ‌య‌, భూదేవిగా రోజా, జ‌న‌క‌మ‌హారాజుగా ముర‌ళీ మోహ‌న్, వ‌శిష్ఠ మ‌హ‌ర్షిగా ఎం. బాల‌య్య‌, చాక‌లి తిప్ప‌డుగా బ్ర‌హ్మానందం, హ‌నుమాన్ గా విందు దారా సింగ్, నార‌దుడిగా ఏవీయ‌స్, భ‌ర‌తుడిగా స‌మీర్, కైకేయిగా స‌న‌, ల‌వ‌గా మాస్ట‌ర్ గౌర‌వ్, కుశ‌గా మాస్ట‌ర్ ధ‌నుష్ కుమార్  ఆక‌ట్టుకున్నారు.

మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా బాణీల‌కు జొన్న‌విత్తుల సాహిత్య‌మందించారు.  ఇందులోని ``జ‌గ‌దానంద కార‌క‌`` గీతం చార్ట్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌గా.. ``దేవుళ్ళే మెచ్చింది``, ``సీతా శ్రీ‌మంతం``, ``సీతారామ చ‌రితం`` పాట‌లు కూడా రంజింప‌చేశాయి. `ఉత్త‌మ చిత్రం`,`ఉత్త‌మ న‌టి` (న‌య‌న‌తార‌), `ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు` (ఇళ‌య‌రాజా), `ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌ణం` (రాజు), `ఉత్త‌మ మేక‌ప్` (పి. రామ్ బాబు), `ఉత్త‌మ అనువాద క‌ళాకారిణి` (సునీత‌), `ఉత్త‌మ నృత్య ద‌ర్శ‌కుడు` (శ్రీ‌ను) విభాగాల్లో `నంది` పుర‌స్కారాలను - ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ గాయ‌ని (శ్రేయా ఘోష‌ల్ - జ‌గ‌దానందకార‌క‌), ఉత్త‌మ గీత ర‌చ‌యిత (జొన్న‌విత్తుల - జ‌గ‌దానంద కార‌క‌) విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డుల‌ను అందుకున్న `శ్రీ‌రామ‌రాజ్యం`ని.. శ్రీ సాయి బాబా మూవీస్ ప‌తాకంపై య‌ల‌మంచలి సాయి బాబు నిర్మించారు. 2011 న‌వంబ‌ర్ 17న విడుద‌లై నంద‌మూరి అభిమానుల‌ను విశేషంగా అల‌రించిన `శ్రీ‌రామ‌రాజ్యం`.. నేటితో ప‌ది వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com