ప్రభాస్-కొరటాల మ్యాజిక్ 'మిర్చి'కి పదేళ్ళు
on Feb 8, 2023
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో 'మిర్చి' ఒకటి. కొరటాల శివ ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రయాణం కూడా ఈ చిత్రంతోనే మొదలైంది. మొదటి సినిమాతోనే దర్శకుడిగా కొరటాల, నిర్మాతలుగా యూవీ క్రియేషన్స్ ఘన విజయాన్ని అందుకున్నారు. 2013 ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రం ఆ సమయానికి ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ పది వసంతాలు పూర్తి చేసుకుంది.
ప్రభాస్ అభిమానుల్లో 'మిర్చి'కి ప్రత్యేక స్థానముంటుంది. ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ, మాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ట్రెండ్ సెట్ చేసింది. కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని సన్నివేశాలు ఎంతగానో అలరించాయి.
ప్రభాస్ జోడీగా అనుష్క నటించిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్, సత్యరాజ్, నదియా, సంపత్ రాజ్, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర విజయంలో దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. పండగలా వచ్చావు, ఇదేదో బాగుంది, డార్లింగే, మిర్చి మిర్చి ఇలా ఆయన స్వరపరిచిన పాటలన్ని విశేష ఆదరణ పొందాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఆర్. మధి, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు.
కమర్షియల్ గా సక్సెస్ అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది ఈ చిత్రం. 2013 సంవత్సరానికి గాను ఏకంగా ఆరు విభాగాల్లో నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఉత్తమ చిత్రం, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు (కొరటాల శివ), ఉత్తమ నటుడు (ప్రభాస్), ఉత్తమ ప్రతి నాయకుడు (సంపత్ రాజ్), ఉత్తమ గాయకడు (కైలాష్ ఖేర్ - పండగలా దిగివచ్చాడు), ఉత్తమ కళాదర్శకుడు (ఏ.ఎస్. ప్రకాష్) విభాగాల్లో మిర్చి చిత్రం నంది అవార్డులు గెలుచుకుంది.