Home

»

Latest News

‘రామాయణ’ రివ్యూ ఇచ్చిన రాజ‌మౌళి.. సినిమా గురించి ఏమ‌న్నారంటే.?

Nov 5, 2026 6:41PM

భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితేశ్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ చిత్రాన్ని చూసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.

‘రామాయణ’ సినిమా భారీ స్థాయి, తెరపై కనిపించే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని రాజమౌళి పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్ద తెరపై ఈ దృశ్యాలను చూస్తుంటే గొప్ప అనుభూతి కలుగుతుందని తెలిపారు. ఇక శ్రీరాముడి పాత్రలో నటించిన రణ్‌బీర్ కపూర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా వనవాసం ఘట్టం మొదలైన తర్వాత రణ్‌బీర్ నటన ఎంతో ప్రశాంతంగా, అదే సమయంలో గంభీరంగా ఉందని ప్రశంసించారు.

ఇక రావణుడి పాత్రలో యశ్ తనదైన ఉనికితో ఆకట్టుకున్నారని రాజమౌళి అన్నారు. రావణుడిగా యశ్ తెరపై కనిపించిన తీరు భయపెట్టేలా ఉందని కొనియాడారు. మరోవైపు సీత పాత్రలో సాయిపల్లవి ఎంతో హుందాగా కనిపించారని ప్రశంసించారు. ఈ ముగ్గురు నటీనటులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారన్న అభిప్రాయాన్ని రాజమౌళి తన రివ్యూలో వ్యక్తం చేశారు.

సినిమాలోని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు తనకు ఎంతగానో నచ్చాయని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని రాజమౌళి పేర్కొన్నారు. ఇంతటి భారీ ఆలోచనను అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రాతో పాటు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: ఇద్దరిలో బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చింది ఈ హీరోనే.. ఆ హీరో ఫ్యాన్స్ ఫీలవ్వద్దు

ఇక ‘రామాయణ’లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రా చేసిన ప్రయత్నం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌పై కూడా రాజమౌళి సానుకూలంగా స్పందించారు. ప్రతి భారతీయ కథకుడు చెప్పాలని కలలు కనే కథ రామాయణమని, ఇలాంటి గొప్ప ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్న చిత్ర బృందాన్ని అభినందించారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మరోసారి ప్రశంసలు కురిపించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మరి రాజమౌళి ప్రశంసలకు తగ్గట్టుగానే ‘రామాయణ’ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు: నెల రోజులపాటు రజనీకాంత్ బర్త్‌డే వేడుకలు.. లారెన్స్ ప్లాన్ వెనుక కారణం ఇదే.!

 


[SS Rajamouli Ramayana Review, Ramayana Part 1, Ranbir Kapoor, Yash, Sai Pallavi, Nitesh Tiwari, Namit Malhotra, Rajamouli Praises Ramayana]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com