![]() |
![]() |

చిరంజీవి తన కెరీర్‌లో ఎంతో నమ్మకంతో చేసిన సినిమాల్లో ఒకటైన 'డాడీ' (2001) సాధారణ ప్రేక్షకుల్నే కాదు, ఆయన వీరాభిమానులనూ నిరుత్సాహానికి గురిచేసింది. కాలం చెల్లిన మూస కథనే ఎంచుకొని చిరంజీవి భంగపాటుకు గురైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది 'డాడీ'. ఆ రోజుల్లో ఫేమస్ రైటర్ అయిన భూపతిరాజా కథను అందించడం, డైరెక్టర్‌గా యమ డిమాండ్‌లో ఉన్న సురేశ్‌కృష్ణ డైరెక్ట్ చేయడం, టాప్ హీరోయిన్ సిమ్రాన్ నటించడం.. ఇన్ని పాజిటివ్ అంశాలతో పాటు స్వయంగా మెగాస్టార్ 'డాడీ'గా కనిపించడంతో సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అందరూ ఊహించారు. కానీ వారి ఊహలకు భిన్నమైన ఫలితం సినిమా రిలీజయ్యాక వచ్చింది. చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని కాలం పన్నెండేళ్లు జరిగిపోయినా ఆయన గెటప్‌లో రవ్వంత కూడా మార్పు చేయకపోవడంతో ఆద్యంతం ఆర్టిఫిషియల్ స్టోరీగానే జనానికి ఇది కనిపించింది.
చైల్డ్ సెంటిమెంట్‌తో కాసులు దండుకోవచ్చని ఊహించిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అంచనాలు దెబ్బతిన్నాయి. 'డాడీ' కథలో రాజ్‌కుమార్ (చిరంజీవి) బాగా డబ్బున్న అనాథ. డాన్స్ స్కూల్ నడుపుతూ ఉంటాడు. ఓ పార్టీలో తారసపడిన శాంతి (సిమ్రాన్)తో తొలి పరిచయం ఆమెకు అతడిపై నెగటివ్ ఒపీనియన్‌ను కలిగిస్తుంది. కానీ మరికొన్ని ఘటనల్లో ఇద్దరూ కలుసుకుంటూ రావడం వల్ల క్రమేపీ అతడిపై ఆమెకు ప్రేమ కలుగుతుంది. ఇద్దరికీ పెళ్లయి, అక్షయ అనే పాప పుడుతుంది. ఫ్రెండ్స్ చేసిన ద్రోహంతో రాజ్‌కుమార్ ఆస్తులన్నీ కోల్పోయి వీధిన పడతాడు. కూతురు అక్షయకు గుండెజబ్బు వస్తుంది. ఆమె ఆపరేషన్ కోసం తాను పొదుపుచేసిన డబ్బును భర్తకు ఇస్తుంది శాంతి. కానీ అదే సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న డాన్స్ స్కూల్ స్టూడెంట్ కోసం ఆ డబ్బు ఖర్చు పెడతాడు రాజ్‌కుమార్. అతను బతుకుతాడు కానీ కూతురు చనిపోతుంది. దీంతో అతడిపై పిచ్చి కోపాన్ని ప్రదర్శించి వెళ్లిపోతుంది శాంతి.
సెకండాఫ్‌లో భార్యను రాజ్‌కుమార్ ఎలా తిరిగి కలుసుకుంటాడనే పాయింట్ మీదే కథ నడుస్తుందని ఎవరైనా ఊహిస్తారు. ఇక్కడో ట్విస్ట్. ఫస్టాఫ్ చైల్డ్ సెంటిమెంట్‌నే సెకండాఫ్‌లోనూ రిపీట్ చేశారు. హఠాత్తుగా శాంతికి మరో కూతుర్ని పెట్టి మరో బాధామయ ఎమోషనల్ డ్రామాని సృష్టించారు (కూతురిగా రెండు పాత్రల్నీ బేబీ ఆంకాక్ష చేసింది). దీంతో నిట్టూర్పుల నుంచి ఆడియెన్స్‌కు రిలీఫ్ అనేది లేకుండా పోయింది. చిరంజీవి కూడా రిలీఫ్ కలిగించడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. 2001 సంక్రాంతికి 'మృగరాజు' మూవీతో తీవ్రంగా నిరాశపరిచిన చిరంజీవి దసరాకి 'డాడీ'గా కూడా మెప్పించలేకపోయారు.
![]() |
![]() |