![]() |
![]() |

ఏది మంచి సినిమా? ఈ ప్రశ్న అప్పుడూ, ఇప్పుడూ ఒకే నిర్వచనంలో ఇమడకుండా ప్రశ్నగానే ఉంటూ వస్తోంది. ఎప్పుడైనా ఇది ఒకే రకమైన నిర్వచనానికి లోబడుతుందా అనేది కూడా సందేహమే. ఎందుకంటే "జనం ఆదరించిన ప్రతి చిత్రమూ మంచి చిత్రమే" అనే వాళ్లతో పాటు "ప్రజలలో చైతన్యం, ఉత్తేజం కలిగించి, నైతికంగా వాళ్లని ప్రగతి మార్గాన మళ్లించగలిగే శక్తి కథలో ఉండి, కళాత్మకంగా కూడా ఉన్నత స్థాయిలో ఉండే సినిమాని బెస్ట్ సినిమాగా పేర్కొనవచ్చు. ప్రజలకు ఎంత బాగా నచ్చిన చిత్రమైనా సరే.. అది ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకపోయినా, అది ఉత్తమ చిత్రం కింద లెక్కలోకి రాదు".. అని ఒకప్పటి సుప్రసిద్ధ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు చెప్పిన నిర్వచనానికి బద్ధులయ్యేవాళ్లూ ఉన్నారు.
మొదటి రకం వాదం చేసేవాళ్లకు సినిమాల్లో నైతిక విలువల గురించి పట్టింపు ఉండదు. జనానికి ఎంటర్టైన్మెంట్ అందిందా లేదా అన్నదే వాళ్లకు ప్రధానం. వాళ్ల దృష్టిలో సినిమా కేవలం బిజినెస్! మొన్నటి దాకా స్టార్ హీరోల కాల్షీట్ల కోసం పరుగులెత్తిన నిర్మాతలు ఇప్పుడు కుర్రహీరోల వెనకపడ్డం మొదలుపెట్టారు. ఇటీవల నిర్మాతల్లో వచ్చిన మార్పు ఏదన్నా ఉంటే అది ఇదే. హీరో హీరోయిన్లను బుక్ చేసుకున్న తర్వాత "కథలో మంచి కామెడీ డైలాగ్స్ రాయండి.. డబుల్ మీనింగ్స్ ఉంటే మరీ మంచిది.. రక్తం మరిగించే ఎమోషనల్ డైలాగ్స్ రాయండి.. మంచి సరస సంభాషణలు రాయండి".. అని రచయితని తొందరపెడతారు. వీటిని బాగా రాయాలంటే కృషి, చురుకుదనం, పదునైన ఆలోచన, ఒక్కోసారి పరిశోధనా అవసరం. కానీ దీనికి టైమ్ లేక, ఇంకేం చెయ్యాలో తోచక, ఆరోగ్యకర హాస్యాన్ని పక్కనపెట్టి ముతక హాస్యాన్ని సృష్టిస్తున్నారు రచయితలు. సరసాన్ని ముంచేసి బూతుల్ని తలకెత్తుకుంటున్నారు.
నిజానికి ఇవాళ సినిమాల్లో టెక్నికల్ వాల్యూస్ గొప్పగా పెరిగాయి. ఇతర భారతీయ భాషా చిత్రాలతో పోలిస్తే తెలుగు సినిమాలు టెక్నికల్‌గా ఏమాత్రం వెనుకంజలో లేకపోగా 'ఈగ', 'బాహుబలి', 'రుద్రమదేవి', 'సైరా.. నరసింహారెడ్డి' లాంటి సినిమాలతో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నామనిపించుకున్నాం. ఐతే ఈ సాంకేతికతకు ధీటుగా సినిమాల్లో నైతిక విలువలు పెరగడం లేదు. సామాజిక స్పృహ ఉండటం లేదు. "అభివృద్ధి అనేది ఎప్పటికైనా తప్పదు" అనే మాటలు తరచూ వింటూ ఉంటాం. కానీ నైతికత, నిబద్ధత అనే అంశాల్లో మన తెలుగు సినిమా ఎప్పటికైనా అభివృద్ధి సాధిస్తుందా అన్నది మాత్రం జవాబు దొరకని ప్రశ్న!
![]() |
![]() |