![]() |
![]() |

కరోనా మహమ్మారి దెబ్బకు గందరగోళంలో పడిపోయిన 'మాస్టర్' మూవీ భవిష్యత్తు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తోంది. ఆ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ పెట్టుకున్న అనేకానేక ఆశలు సన్నగిల్లుతూ వస్తున్న వేళ దీపావళి సందర్భంగా ఆ ఆశల్ని అమాంతం పెంచుతూ వచ్చింది 'మాస్టర్' టీజర్. అనూహ్యమైన రెస్పాన్స్‌తో అప్పుడే 26 మిలియన్ వ్యూస్‌తో ఈ టీజర్ సొంతం చేసుకుంది. 1 నిమిషం 30 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో కథేమిటనేది మనకు పెద్దగా తెలియదు. కొన్ని విషయాలు మాత్రం ఆ టీజర్ ద్వారా తెలియజేశాడు డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్.
విజయ్ ఈ టీజర్‌లో జె.డి. అనే ఓ కాలేజీ ప్రొఫెసర్‌గా కనిపించాడు. తన స్టూడెంట్స్ కోసం అతను ఫైట్లు చేశాడు. సినిమాలో ఒళ్లు గగుర్పాటు కలిగించే యాక్షన్ సీక్వెన్స్‌లు చాలానే ఉన్నాయని ఈ టీజర్ మనకు తెలియజేసింది. మెట్రో ట్రైన్‌లోనూ అలాంటి ఓ స్టంట్ కనిపిస్తుంది. అంటే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ చెన్నై సిటీగా ఊహించవచ్చు. టీజర్ మొదట్లోనే మాస్టర్ తాగుతూ, తూలుతూ కనిపించాడు. దాన్ని బట్టి అతనికి ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉండే అవకాశాలున్నాయనే అభిప్రాయం కలుగుతోంది. తెలుగులో వచ్చిన చిరంజీవి మాస్టర్ సినిమా ఇక్కడ గుర్తుకువస్తోంది. అయితే ఆ మాస్టర్ కథకూ, ఈ మాస్టర్ కథకూ చాలా తక్కువ పోలికలు ఉంటాయని నమ్మవచ్చు.
టీజర్‌లో ఏ క్యారెక్టర్ చేతా మాటలు పలికించలేదు. బ్యాగ్రౌండ్‌లోనే మనకు డైలాగ్స్ వినిపిస్తుంటాయి. వీటిలో ఎక్కువ భాగం విజయ్ సేతుపతి క్యారెక్టర్ ద్వారా పలికించినవే. విజయ్ పోషించిన ప్రొఫెసర్ జె.డి. క్యారెక్టర్‌ను ఒక మిస్టరీగానే ఉంచేందుకు ఈ టీజర్ ప్రయత్నించిందని చెప్పాలి. మాస్టర్ పనిచేసే కాలేజీలోనే హీరోయిన్ మాళవికా మోహనన్ దర్శనమిచ్చింది. టీజర్ చివరలో ఇద్దరు స్టార్లు విజయ్, విజయ్ సేతుపతి కొదమ సింహాలు మాదిరిగా పిడికిళ్లతో ఢీకొట్టుకున్నారు. వాళ్ల మధ్య ఘర్షణ ఉత్తేజభరితంగా ఉంటుందని టీజర్ ప్రామిస్ చేస్తోంది.
విజయ్ సేతుపతి మెయిన్ విలన్‌గా నటించిన ఈ మూవీలో ఆండ్రియా జెర్మియా, శంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్, గౌరీ కిషన్ ఇతర పాత్రధారులు. కాలేజీ నేపథ్యంలో నడిచే ఈ యాక్షన్ డ్రామాకు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకొనేట్లు చేస్తోంది. అనిరుధ్ కంపోజ్ చేసిన 'వాతి కమింగ్' సాంగ్ ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్టయి యూట్యూబ్‌లో 86 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది.
అట్లీ డైరెక్ట్ చేయగా గత ఏడాది దీపావళికి వచ్చిన 'బిగిల్'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విజయ్ నటించిన మాస్టర్ మూవీ ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని ఈ టీజర్ వెల్లడించలేదు. కాకపోతే సూర్య సినిమా 'సూరారై పొట్రు' మాదిరిగా ఈ సినిమా ఓటీటీలో విడుదలవదనీ, నేరుగా థియేటర్లలోనే విడుదలవుతుందనేది స్పష్టం. బహుశా డిసెంబర్‌లో వచ్చే ట్రైలర్‌లో మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయవచ్చు. ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా ఏక కాలంలో వస్తుందా, రాదా అనే విషయం వెల్లడి కాలేదు. ఎందుకంటే 'మాస్టర్' టీజర్ తెలుగులో రాలేదు కాబట్టి.
![]() |
![]() |