![]() |
![]() |

టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ సమంత అక్కినేని 'సామ్ జామ్' టాక్ షోతో డిజిటల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టారు. ఆహా ఓటీటీలో అది స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఆమె 'ద ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2తో ముందుగా రావాల్సింది కానీ, అది స్ట్రీమింగ్ అవడం ఆలస్యం కావడంతో 'సామ్ జామ్'తో వచ్చారు. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'తో తను కొత్త ప్రయోగం చేశాననీ, అది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుందనీ ఆమె అన్నారు.
"అన్ని నియమాలనూ ఉల్లంఘించే అవకాశం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇస్తుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'తో నేను అన్ని నియమాలనూ బ్రేక్ చేశాను, కొత్త ప్రయోగం చేశాను" అని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత చెప్పారు. ఈ వెబ్ సిరీస్‌లో ఆమె మనోజ్ బాజ్‌పేయితో కలిసి నటించారు. అతను పోషించిన శ్రీకాంత్ తివారీ పాత్రకూ, సమంత చేసిన పాత్రకూ మధ్య ఘర్షణ ఎలా ఉంటుందో ఈ సిరీస్‌లో మనం చూడబోతున్నాం.
"ఈ సిరీస్ ఔట్‌పుట్ వచ్చిన విధానానికి నేను చాలా హ్యపీగా ఉన్నాను. నన్ను కొన్ని నిర్దిష్టమైన పాత్రల్లో చూడ్డానికి అలవాటుపడ్డ ప్రేక్షకులకు ఇందులో నేను చేసిన క్యారెక్టర్ సర్‌ప్రైజ్‌ను ఇస్తుంది" అన్నారు సమంత. ఓటీటీ అంతకంతకూ విస్తృతమవుతుండటం పట్ల ఆమె సానుకూల ధోరణిని వ్యక్తం చేశారు. ఈ ప్లాట్‌ఫామ్ ప్రతి ఒక్కరికీ ద్వారాలను తెరుస్తోందని ఆమె అన్నారు.
రాజ్ అండ్ డీకే నిర్మించి, దర్శకత్వం వహించిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో మనోజ్ బాజ్‌పేయి, సమంత, ప్రియమణి, షరీబ్ హష్మి, దర్శన్ కుమార్, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి ప్రధాన పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్‌లో ఇది స్ట్రీమింగ్ కానున్నది.
![]() |
![]() |