![]() |
![]() |

గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికీ సినిమాల రిలీజ్‌ల విషయంలో రకరకాల తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఎన్ని సినిమాలు రిలీజ్‌కి ఉన్నా అందరు నిర్మాతలు ఒక అండర్‌స్టాండిరగ్‌కి వచ్చి రిలీజ్ డేట్స్‌ను ఎడ్జస్ట్ చేసుకునేవారు. తద్వారా థియేటర్ల సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటోంది. అయితే ఈసారి సమస్య మరింత జఠిలంగా కనిపిస్తోంది. పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలు కూడా బరిలో ఉంటే అంత సమస్య ఉండదు. కానీ, ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ మంచి బజ్ ఉన్నవే. దాంతో రిలీజ్ డేట్‌ల కేటాయింపు ఓ పట్టాన తేలడం లేదు. అన్ని సినిమాలూ ఒకే టైమ్‌కి వచ్చేస్తే ఆ సినిమాలపై కలెక్షన్ల ప్రభావం తప్పకుండా పడుతుంది. దీనివల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదన్న విషయాన్ని గ్రహించాలని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నారు. అందుకే ఈ విషయమై చర్చించేందుకు ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.
అసలు ఈ సంక్రాంతి ఏయే సినిమాలు ఎప్పుడు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయనేది ఓసారి పరిశీలిస్తే.. ‘గుంటూరు కారం’ నిర్మాతలు తమ సినిమా జనవరి 12న వస్తుందని ఎంతోకాలం క్రితమే క్లారిటీ ఇచ్చారు. దానితోపాటు ‘హనుమాన్’ చిత్రాన్ని కూడా జనవరి 12నే రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. వాస్తవానికి ఈ సినిమా 2023 మధ్యలోనే రిలీజ్ అవ్వాలి. కానీ, ఒక సూపర్‌హీరో సినిమా ప్లస్ విజువల్‌గా అందరూ మెచ్చే సినిమా కావడంతో సంక్రాంతి అయితేనే సినిమాకి బాగా రీచ్ ఉంటుందని భావించిన నిర్మాతలు ఆలస్యమైనా ఫర్వాలేదని సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాలతోపాటు ‘ఈగిల్’ కూడా సంక్రాంతినే టార్గెట్ చేసింది. ఇక నాగార్జున, వెంకటేష్‌లకు సంక్రాంతి సెంటిమెంట్ ఎలాగూ ఉంది కాబట్టి తమ సినిమాలు ‘నా సామిరంగ’, ‘సైంధవ్’లను కూడా సంక్రాంతికే రిలీజ్ చెయ్యాలని పట్టుదలగా ఉన్నారు.
సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో ఇలాంటి క్లాష్ ఉండడం ఆరోగ్యకరం కాదని భావించిన దిల్‌రాజు అందరూ ఒకసారి సమావేశమైతే బాగుంటుందని భావించి అందర్నీ హాజరు పరచాలనుకున్నారు. కానీ, ఈ సమావేశానికి గుంటూరు కారం నిర్మాత నాగవంశీ, ఈగిల్ నిర్మాత విశ్వప్రసాద్, నా సామిరంగ నిర్మాత శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. హనుమాన్ నిర్మాత నిరంజన్‌రెడ్డి, సైంధవ్ నిర్మాత వెంకట్ బోయనపల్లి మాత్రం హాజరు కాలేదు. తమ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఎప్పుడో ఎనౌన్స్ చేశామని, దాన్ని బట్టే బిజినెస్ క్లోజ్ అయ్యిందని, ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తే చాలా ఇబ్బంది అవుతుందని నిరంజన్‌రెడ్డి భావిస్తున్నారు. గుంటూరు కారం, సైంధవ్ సినిమాలు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఈ రెండు సినిమాల విషయంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఇక హనుమాన్ నిర్మాత సమావేశానికి హాజరు కాలేదు. దీన్నిబట్టి అతను కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మిగిలిన సినిమాలు నా సామి రంగ, ఈగిల్ నిర్మాతలు కూడా సంక్రాంతికే తమ సినిమాలు రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారు. సమస్యకు మంచి పరిష్కారం ఇవ్వాలని భావించి దిల్‌రాజు ఏర్పాటు చేసిన సమావేశం విఫలమైంది. వారం తర్వాత మరోసారి అందరితో చర్చలు జరపాలని దిల్‌రాజు డిసైడ్ అయ్యారట. మరి తర్వాతి సమావేశంలో అయినా ఈ సినిమాల రిలీజ్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారో లేక అందరూ బరిలోనే ఉంటారో చూడాలి.
![]() |
![]() |