![]() |
![]() |

కొన్నాళ్ల క్రితం క్యూట్ గాళ్ శ్వేతాబసు ప్రసాద్ వార్తల్లో వ్యక్తిగా ఉన్న విషయం మనకు తెలుసు. దిగ్భ్రాంతికరంగా హైదరాబాద్‌లో ఒక కేసులో చిక్కుకొన్న ఈ 'కొత్త బంగారులోకం' హీరోయిన్ లైఫ్ ఎలా ఉంటుందోనని ఆమె అభిమానులు ఆందోళన చెందారు కూడా. ఆ టైమ్‌లో శ్వేతాబసుకు తన సినిమాలో అవకాశమిస్తానని మంచు విష్ణు లాంటి హీరోలు ప్రకటనలు చేశారు. అయితే ఎవరి సానుభూతి, సహాయం తనకు అవసరం లేదని, స్వతంత్రంగానే, స్వశక్తినే నమ్ముకుంటానని నిరూపించే దిశగా అడుగులు వేసింది శ్వేత.
ఇప్పుడు ఆ దిశలో భాగంగా ఆమె చేసిన 'కామెడీ కపుల్' మూవీ మన ముందుకొచ్చింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాని శ్వేతాబసు కోసమైనా చూడాల్సిందే. జోయా క్యారెక్టర్‌లో అలాంటి చక్కని పర్ఫార్మెన్స్ ఆమె ఇచ్చింది. 'కామెడీ కపుల్' ఒక రొమాంటిక్ కామెడీ. దేశంలో ఇవాళ స్టాండప్ కామెడీకి ఆదరణ పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ రంగంలో ఇప్పటికే పలువురు రాణిస్తూ అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతున్నారు. అలాగే దీప్ శర్మ (సాఖిబ్ సలీమ్), జోయా బాత్రా (శ్వేతాబసు) అనే ఒక యువజంట స్టాండప్ కమెడియన్స్ కావాలని నిర్ణయించుకొని ఎలాంటి అనుభవాలను పొందారనేదే ఈ చిత్ర కథ.
తమ మధ్య భేదాభిప్రాయాలతో ఆ ఇద్దరూ ఎలాంటి చిన్న, పెద్ద సమస్యలను ఎదుర్కొన్నారో వినోదాత్మకంగా మనం చూడొచ్చు. రెగ్యులర్ కపులకు వచ్చే రెగ్యులర్ ప్రాబ్లమ్సే ఈ కపుల్‌కు వస్తాయి. ఆసక్తికర మలుపులతో, దేశంలోని భావప్రకటనా స్వేచ్ఛ గురించి స్పృశిస్తూ, ప్రజల మనోభావాలను దెబ్బతీయని ఆరోగ్యకర జోక్స్‌తో సినిమా నడుస్తుంది.

నచికేత్ సామంత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కథ పాత్-బ్రేకింగ్ టైప్‌దేమీ కాదు. డైరెక్షన్ కూడా గొప్పగా ఏమీ లేదు. కానీ ఓటీటీ వీక్షకుల్ని కట్టిపడేసే హిలేరియస్ ట్విస్ట్‌లు ఈ మూవీలో ఉన్నాయి. పైగా దీప్, జోయా పాత్రలతో మనం సహానుభూతి చెందడం ఈ సినిమా సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. 'కామెడీ కపుల్'కు సంబంధించిన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ జోయా పాత్రను చేసిన శ్వేతాబసు, దీప్‌గా నటించిన సాఖిబ్ నటన. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సాఖిబ్ ఆకట్టుకుంటే, శ్వేతాబసు తన నటనతో మనల్ని ప్రేమలో పడేస్తుంది.
సెన్సిటివ్‌గా ఉండే, ఎదుటివాళ్లకు హానిచేయని చిన్న చిన్న అబద్ధాలతో లైఫ్‌ను గడిపేయవచ్చనే దీప్ క్యారెక్టర్‌కు సాఖిబ్ ఎంత న్యాయం చేశాడో, పంచ్‌లైన్స్‌తో, బోళాతనంతో వాయిస్ ఆఫ్ ద కపుల్‌గా కనిపించే జోయా పాత్రలో అంతకు మించి రాణించింది శ్వేత. 'కొత్త బంగారులోకం'లోనూ బోళాతనం, తెలివి కలగలసిని పాత్రలో ఆమెను మనం ఎంతగా ఇష్టపడ్డామో, ఈ సినిమాలోని జోయా పాత్రతోనూ అలాగే ప్రేమలో పడతాం. సాఖిత్‌బో రొమాంటిక్ సీన్స్‌లో కానీ, అతడితో పోట్లాడే సీన్లలో కానీ శ్వేత అదరగొట్టేసింది.
'కామెడీ కపుల్' గొప్ప సినిమా కాకపోయినా చూసి, ఎంజాయ్ చెయ్యగల సినిమా. అందులోనూ శ్వేతాబసు కోసం మరోసారి కూడా చూడాలనిపించే సినిమా. ఎన్నాళ్ల తర్వాత ఆమెను తెరపై ఒక పూర్తి స్థాయి హీరోయిన్‌గా చూసి, ఎంజాయ్ చేసే అవకాశం కలిగింది అనిపిస్తుంది! కావాలంటే మీరూ చూడండి...
![]() |
![]() |