![]() |
![]() |

సాధారణంగా ఒక సినిమా షూటింగ్‌ను ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేద్దామా, మరో సినిమాని స్టార్ట్ చేద్దామా అని చూస్తుంటారు స్టార్లు. సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున మాత్రం 'వైల్డ్ డాగ్' షూటింగ్‌లో తన పోర్షన్ కంప్లీట్ అయినందుకు బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుంటే బావుంటుంది. శుక్రవారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా 'వైల్డ్ డాగ్' షూటింగ్ సెట్‌లో తోటి నటులతో తీసిన పిక్చర్లతో పాటు మనాలి అందాలను తెలియజేసే ఓ పిక్చర్‌ను కూడా నాగార్జున షేర్ చేశారు. దాంతో పాటు "వైల్డ్ డాగ్‌లో నా వర్క్ పూర్తిచేసి ఇంటికి బయలుదేరుతున్నా! నా టాలెంటెడ్ టీమ్‌ను, హిమాలయాలకు వీడ్కోలు చెబుతుంటే బాధగా అనిపిస్తోంది" అని రాసుకొచ్చారు నాగ్. దానికి #manali అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న 'వైల్డ్ డాగ్'లో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఆయన పోషిస్తున్న ఏసీపీ విజయ్ వర్మ అనే క్యారెక్టర్‌ను కథ ప్రకారం అందరూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. క్రిమినల్స్‌ను ఆయన డీల్ చేసే విధానం అంత కఠినంగా ఉంటుందన్న మాట. దాదాపు 20 రోజుల క్రితం నాగార్జున బిగ్ బాస్ షోను వదిలి 'వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం మనాలి వెళ్లారు. అక్కడ నుంచి ఆయన అప్పుడప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ వచ్చారు. హిమాలయాల అందాలు తన పరవశింపచేస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు తన పార్ట్ పూర్తయిందని వెల్లడిస్తూ అప్‌డేట్ ఇచ్చారు. నటి సయామీ ఖేర్‌తో పాటు ఇతర నటులతో తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు.

![]() |
![]() |