![]() |
![]() |

ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5' తాజాగా మరో ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామాను ప్రజల ముందుకు తీసుకొస్తోందని చెప్పవచ్చు. 'జీ 5' కోసం ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ నిర్మించిన వెబ్ సిరీస్ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు'. మంగళవారం సాయంత్రం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.
పోలీసులను నడిరోడ్డు మీద తుపాకీతో కాల్చి చంపుతున్న ఘటనలు వార్తల్లో ముఖ్యాంశం అవుతున్నాయి. 2007 నుండి 2010 వరకు ప్రతి ఏడాది మక్కా మసీదు బాంబు బ్లాస్ట్ యానివర్సరీ రోజున హిందూ పోలీసులను చంపిన అక్తరే, ప్రస్తుత మరణాలకు కారణమా? అని మీడియా సందేహం వ్యక్తం చేస్తుంది. ఐదేళ్ల క్రితం ఎన్కౌంటర్ లో మరణించిన అక్తర్ మరణాలకు కారణం అంటే పోలీసులు నమ్ముతున్నారా? మరణించిన అక్తర్ మళ్లీ ఎలా బతికొచ్చాడు? తమపై సాగిస్తున్న హత్యాకాండకు పోలీసులు ఎలా ముగింపు పలికారు? వంటి విషయాలు వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తాయని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. పోలీసాఫీసర్లుగా శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ నటించగా, మరో రెండు కీలక పాత్రలను నందినీ రాయ్, రవి కాలే పోషించారు.
'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను నెలకొల్పి... తొలి ప్రయత్నంగా నిర్మించిన వెబ్ సిరీస్ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు'. 'జీ 5' అసోసియేషన్‌తో ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ వెబ్ సిరీస్ 'జీ 5'లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. దీనికి ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయని 'జీ 5' వర్గాలు వెల్లడించాయి.
ఇటీవలి కాలంలో 'లూజర్స్', 'చదరంగం', 'గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)' లాంటి ఒరిజినల్ వెబ్ సిరీస్ జీ 5లో మంచి వీక్షకాదరణ పొందాయి. 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు'తో మరోసారి అది వీక్షకుల మనసు గెలుచుకునేలా కనిపిస్తోంది.

![]() |
![]() |