![]() |
![]() |

గాయని సునీత, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని వివాహం జనవరిలో జరగనున్నది. సోమవారం వారి నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. తమ పెళ్లి విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా సునీత స్వయంగా వెల్లడించారు. "ప్రతి తల్లి మాదిరిగానే, నా పిల్లలు బాగా స్థిరపడాలని నేను కలలు కంటున్నాను. అదే సమయంలో, నేను జీవితంలో బాగా సెటిలవడం చూడాలని ఎప్పుడూ కోరుకొనే అద్భుతమైన, ఆలోచనాత్మకమైన పిల్లలు, తల్లిదండ్రులను కలిగి ఉండటం నా భాగ్యం. ఆ క్షణం ఎట్టకేలకు వచ్చింది. రామ్ నా జీవితంలోకి ఒక కేరింగ్ ఫ్రెండ్‌గా, వండర్‌ఫుల్ పార్టనర్‌గా అడుగుపెట్టారు. అతి త్వరలోనే వైవాహిక బంధంలోకి ప్రవేశిస్తుండటం మా ఇద్దరికీ ఆనందంగా ఉంది. అంటూ ఆమె రాసుకొచ్చారు.
కాగా ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ తమ వివాహం అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో 2021 జనవరిలో జరుగుతుందని సునీత వెల్లడించారు.
సునీత, రామ్ ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. సునీతకు పందొమ్మిదేళ్ల వయసులో గోపరాజు కిరణ్ కుమార్ అలియాస్ లక్కీతో మొదటి వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు.. ఆకాశ్, శ్రేయ. పదేళ్లపాటు సజావుగానే నడిచిన వారి సంసారం.. ఆ తర్వాత ఇబ్బందుల్లో పడింది. దశాబ్దం క్రితం విడిపోయిన వారు, తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు.
రామ్ కూడా చాలా కాలం క్రితమే మొదటి భార్యతో విడిపోయారు. కొంతకాలంగా స్నేహితులుగా ఉన్న సునీత, రామ్.. మనసులు కలియడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయాన్ని వారు ఇంతకాలం రహస్యంగా ఉంచారు. పెద్దలు, పిల్లలు కూడా అంగీకరించడంతో రెండు కుటుంబాల సమక్షంలో నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు.


![]() |
![]() |