![]() |
![]() |

ఇది నిజంగా బిగ్ న్యూస్. రెండున్నరేళ్ల తర్వాత సినిమా సెట్స్‌పై అడుగుపెట్టాడు షారుఖ్ ఖాన్. ఆయన 'పఠాన్' షూటింగ్లో పాల్గొంటున్నాడు. ముంబైలోని అంధేరీలో ఉన్న యష్ రాజ్ స్టూడియోస్‌లోని సెట్స్‌లోకి వచ్చి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ సూచనలకు తగ్గట్లు నటించడం మొదలుపెట్టాడు. షారుఖ్ ఖాన్ బుధవారం 'పఠాన్' సెట్స్‌పైకి అడుగు పెడుతున్నాడనే విషయాన్ని నిర్మాతలు యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేతలు సీక్రెట్‌గా ఉంచారు.
షారుఖ్ మునుపటి సినిమా 'జీరో' 2018 డిసెంబర్లో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర అది డిజాస్టర్ కావడంతో అప్పట్నుంచీ ఏ సినిమాకూ సంతకం చేయకుండా స్క్రిప్ట్‌ల పరిశీలనలో మునిగిపోయాడు షారుఖ్. ఈ మధ్య కాలంలో ఆయన దాదాపు 20 స్క్రిప్టులు చదివాడు. ఏడాది పైగా సమయం తీసుకొని అప్పుడు తను చేయాలనుకున్న వాటిని ఫైనలైజ్ చేశాడు. 2020 ప్రారంభంలో పఠాన్ స్క్రిప్ట్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా, 'వార్' (2019) ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది రూపొందుతోందని సమాచారం.
'జీరో' సినిమా కోసం చివరిసారిగా 2018 జూన్‌లో షూటింగ్లో పాల్గొన్నాడు షారుఖ్. రెండున్నరేళ్ల తర్వాత కింగ్ ఖాన్ సినిమా సెట్స్‌పైకి వస్తే నిర్మాతలు ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 'పఠాన్'లో దీపికా పడుకోనే హీరోయిన్ కాగా, జాన్ అబ్రహాం మరో కీలక పాత్రను చేస్తున్నాడు.
![]() |
![]() |