![]() |
![]() |

సూపర్‌స్టార్ రజనీకాంత్ 2021 జనవరి నుంచి 'అన్నాత్తే' షూటింగ్‌ను పునరుద్ధరించనున్నారు. అదే నెలలో ఆయన తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించనున్న విషయం తెలిసిందే. అందువల్ల సింగిల్ షెడ్యూల్‌లో 'అన్నాత్తే' సినిమాని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. "అన్నాత్తే చిత్రానికి సంబంధించి 40 శాతం షూటింగ్ మాత్రమే మిగిలుంది. దాన్ని మొదట పూర్తి చేయడం నా డ్యూటీ" అని రజనీకాంత్ చెప్పారు. తనకు సంబంధించిన సన్నివేశాలు పూర్తయిన వెంటనే ఆయన తన పార్జీ తరపున రాజకీయ కార్యకలాపాలు ప్రారంభిస్తారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో 'అన్నాత్తే షూటింగ్' ఆగిపోయింది. కొవిడ్ 19 వ్యాప్తి కారణంగా ఇంతదాకా షూటింగ్‌ను పునరుద్ధరించడానికి నిర్మాతలకు వీలు పడలేదు. ఇంతకుముందు ఈ ఏడాది చివరిలోగా షూటింగ్ పూర్తి చేసి, పొంగల్‌కు సినిమాను రిలీజ్ చేస్తామని వారు ప్రకటించారు. కానీ రజనీకాంత్ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటిదాకా షూటింగ్‌కు వారు పునరుద్ధరించలేదు.
'అన్నాత్తే' సినిమా కోసం డైరెక్టర్ శివతో తొలిసారి కలిసి పనిచేస్తున్నారు సూపర్‌స్టార్. ఆయన స్టైల్‌ను దృష్టిలో ఉంచుకొని, తన పంథాలో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని శివ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఆసక్తికరమైన విషయమేమంటే, అజిత్‌తో శివ తీసిన మునుపటి మూవీ 'విశ్వాసమ్', రజనీ చిత్రం 'పేట'తో 2019 పొంగల్‌కి పోటీ పడింది. ఆ రెండు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి.
'అన్నాత్తే'లో ఒక లోకల్ పొలిటికల్ లీడర్‌గా రజనీ కనిపించనున్నట్లు వినిపిస్తోంది. రజనీ తరహా పంచ్ డైలాగ్స్ ఈ మూవీలో కొల్లలుగా ఉంటాయంటున్నారు. ఇందులో ఖష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్, ప్రకాశ్ రాజ్, సతీశ్, సూరి తదితర భారీ తారాగణం నటిస్తోంది.
![]() |
![]() |