![]() |
![]() |

శివాజీ గణేశన్, ఎస్వీ రంగారావు లాంటి మహానటుల్నే డామినేట్ చేసే అభినయ సామర్థ్యం మహానటి సావిత్రి సొంతం. సమయపాలన అంటే సావిత్రి తర్వాతే ఎవరైనా! చెప్పిన టైమ్‌కి లొకేషన్లో ఉండేవారు. నిర్మాత బాగు కోరుకునే కథానాయిక ఆమె. సావిత్రి కరెక్ట్ టైమ్‌కి వస్తారనే భయంతో మిగతా నటీనటులు కూడా కరెక్ట్ టైమ్‌కి వచ్చేవాళ్లు. 'దేవదాసు' సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు అమేయమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అది ఆయన సినిమా. అయినప్పటికీ ఆ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం... దేవదాసు చనిపోయాడని తెలియగానే.. పార్వతి పరుగుపరుగున వస్తూ... అమాంతం మెట్లపై నుంచి దొర్లుకుంటూ కింద పడిపోతుంది. ఆ సన్నివేశంలో సావిత్రి అభినయం ఎప్పటికీ మరచిపోలేం.
ఇక ‘మిస్సమ్మ’ విషయానికొస్తే... అదో కొత్త కోణం. ఆ తర్వాత కూడా సాంఘికాల్లో నటిగా ఎన్నో ప్రయోగాలు చేశారామె. పౌరాణికాల విషయానికొస్తే ‘మాయాబజార్’, ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’... ఇలా చాలానే ఉన్నాయి. పౌరాణిక పాత్రల్లో సావిత్రి డైలాగ్ డెలివరీ అద్భుతం. అసలు అలాంటి మహానటిని మరొకరిని మనం చూడలేదనేది ఇప్పటికీ ఓ వాస్తవం.
అంతేకాదు.. ఆమెలో ఉన్నతస్థాయి దర్శకురాలు ఉంది. ‘చిన్నారి పాపలు’, ‘మాతృదేవత’ చిత్రాలను చాలా గొప్పగా తీశారు సావిత్రి. నటిగానే కాదు, దర్శకురాలిగా కూడా ఆమెలో లోపాలు ఎంచలేం. అయితే ఆమెకు సరైన సహకారం లభించలేదు. జెమినీ గణేశణ్ నుంచి ఆమెకు సరైన సహకారం లభించి ఉంటే.. ఇంకా గొప్ప సినిమాలు డెరైక్ట్ చేసేవారేమో! నిర్మాతగా కూడా ఆమెకు అన్నీ ఎదురుదెబ్బలే. ‘మూగమనసులు’ చిత్రాన్ని ‘ప్రాప్తం’గా తమిళంలో రీమేక్ చేస్తే... అది పరాజయం పాలైంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిసెంబర్ 6 ఆమె జయంతి.
![]() |
![]() |