![]() |
![]() |

సినీ తారలపై వచ్చే వదంతులకు అంతు ఉండదు. ప్రేమ, పెళ్లికి సంబంధించి, రిలేషన్షిప్స్కు సంబంధించి హీరోయిన్లపై అనేక ప్రచారాలు నిత్యం చలామణీ అవుతుంటాయి. సోషల్ మీడియా యుగంలో ఇది మరింత ఎక్కువైంది. ఆ ప్రచారాలను సదరు తారలు ఖండిస్తూ రావడం కూడా మనం చూస్తుంటాం. మలయాళం భామ పూర్ణ అలియాస్ షామ్నా కాశిమ్పై కూడా అలాంటి వదంతులకు కొదవ లేదు. ఈ మధ్య ఓ పెళ్లి వ్యవహారానికి సంబంధించి ఒక గ్యాంగ్ ఆమెను బ్లాక్మెయిల్ చేసి పోలీసులకు దొరికిపోవడం సంచలనం సృష్టించింది.
ఆ విషయం అలా ఉంచితే, గతంలోనూ ఓ కెమెరామన్‌తో ఆమెకు రిలేషన్షిప్ ఉన్నట్లు ఉధృతంగా ప్రచారంలోకి వచ్చింది, భరణి అనే ఆ కెమెరామన్‌ను ఆమె పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అయ్యిందని వినిపించింది. పూర్ణ కాల్షీట్స్, ఆమె రెమ్యూనరేషన్ వ్యవహారాలను సైతం భరణి చూసుకుంటున్నాడనేది కూడా గాసిప్స్‌లో భాగం. వీటన్నింటినీ పూర్ణ ఖండించారు. భరణిని తాను రెండు మూడు సార్లు మాత్రమే కలుసుకున్నాననీ, అసలు అతనితో కలిసి తానెప్పుడూ పనిచేయలేదనీ కూడా ఆమె స్పష్టం చేశారు. ఒక సినిమా గురించిన చర్చల్లో భాగంగానే భరణిని కలిశాను తప్ప, అతనితో కలిసి తాను షికార్లు చేస్తున్నట్లు ప్రచారం చేయడం దారుణమని ఆమె అన్నారు. తాను భరణిని ప్రేమిస్తున్నాననడం ఎంత అసత్యమో, తన కాల్షీట్స్ వ్యవహారాలు తను చూస్తున్నారనడం కూడా అంతే అవాస్తవం అన్నారు.
'సీమ టపాకాయ్', 'అవును' లాంటి చిత్రాలతో టాలీవుడ్లో పాపులర్ అయిన పూర్ణ, ప్రస్తుతం బాలయ్యతో బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న చిత్రంలో ఓ నాయికగా నటిస్తున్నారు. అలాగే డాన్స్ షో 'ఢీ'కి ఓ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |