![]() |
![]() |

కమలహాసన్ గొప్ప నటుడు. ఎంత గొప్ప నటుడంటే ఇతర నటులే తమ అభిమాన నటుడు, తమకు స్ఫూర్తినిచ్చే నటుడు కమల్ అని చెప్పేంటత. నటనకు సరైన నిర్వచనం కమల్. ఎందుకంటే సినిమా అంటే కమల్. కమల్ అంటే సినిమా. ఆరు దశాబ్దాలకు పైగా సినిమాను కాచి వడబోసిన కళాకారుడు కమల్. అంతగా సినిమాను ప్రేమించినా కమల్‌కు సినిమాలో కొన్నిసార్లు ఎదురీదక తప్పలేదు. అయితే ఆ ఆటుపోట్లు ఎలాంటివైనా కమల్‌ను ఏమి చేయలేకపోయాయి. 'విరుమాండి' చిత్రానికి ముందు 'చండియార్' అనే పేరును కమల్ నిర్ణయించారు. అయితే ఆ టైటిల్‌కు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఆ టైటిల్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ తరువాత 'వసూల్ రాజా ఎంబీబీఎస్' చిత్ర సమయంలో ఆ టైటిల్‌కు కొందరు డాక్టర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ఇక 'విశ్వరూపం' చిత్ర విడుదల సమయంలో కమలహాసన్ ఎంత మనస్థాపానికి గురయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చివరికి న్యాయస్థానం జోక్యం చేసుకుని ఆ సినిమా విడుదలకు మార్గం సుగమం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కమల్ కంట తడిపెట్టడం ప్రతి ఒక్క అభిమాని మనసును ద్రవింప చేసింది.
ఒకసారి నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్, "మీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటే ఎలాంటి చిత్రం చేస్తారు?" అని కమల్‌ను ప్రశ్నించారు. అందుకు కమల్ బదులిస్తూ చేతినిండా డబ్బు ఉంటే చిత్ర నిర్మాణమే మానేస్తానని అన్నారు. అయితే చిత్రాలను చూసే ప్రేక్షకులను తయారు చేస్తానని చెప్పారు. తద్వారా నిర్మాతలకు లబ్ధి చేకూరుతుందన్నారు. సినిమా బతికి బట్టకట్టేది ప్రేక్షకుల వల్లేననీ, అందుకే సినిమాకు అత్యంత ముఖ్యమైనవారు ప్రేక్షకులేనని కమల్ చెప్పారు.
![]() |
![]() |