![]() |
![]() |

సీనియర్ నటి, నిన్నటి తరం అగ్ర తారల్లో ఒకరైన జయచిత్ర భర్త గణేశ్ గురువారం రాత్రి తిరుచ్చిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1983లో గణేశ్‌ను జయచిత్రం వివాహం చేసుకున్నారు. 1988లో వారికో కుమారుడు కలిగాడు. అతనే నేటి యువ సంగీత దర్శకుడు అమ్రిష్. గాయకుడు కూడా అయిన అతను తమిళ చిత్రసీమలో మంచి పేరు తెచ్చుకున్నాడు.
జయచిత్ర 'భక్త పోతన' చిత్రంతో బాలనటిగా చిత్రసీమలో అడుగుపెట్టారు. 1972లో జెమినీ గణేశన్, కమల్ హాసన్ కలిసి నటించిన తమిళ చిత్రం 'కురది మగన్'తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో నటించిన 'కల్పన' చిత్రం ఆమెకు అమిత పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు లాంటి టాప్ స్టార్స్ అందరి సరసనా ఆమె హీరోయిన్‌గా నటించారు. ఆమె హీరోయిన్‌గా నటించిన చిత్రాల్లో రావణుడే రాముడైతే, సోగ్గాడు, లవ్ మ్యారేజ్, అల్లరి వయసు, రిక్షా రాజి, చెప్పింది చేస్తా, ప్రయాణంలో పదనిసలు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, కటకటాల రుద్రయ్య, అన్నదమ్ముల సవాల్, యవ్వనం కాటేసింది, ముద్దబంతి పువ్వు, మా దైవం లాంటివి ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ఆమె అబ్బాయిగారు, రాజేశ్వరీ కల్యాణం, సమరసింహారెడ్డి, ఘరానా బుల్లోడు తదితర చిత్రాల్లో నటించారు.
పలు తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ ఆమె నాయికగా నటించారు. హీరోయిన్‌గా తారాపథంలో ఉన్న కాలంలోనే ఆమె కుంభకోణంకు చెందిన గణేశ్‌ను వివాహమాడారు. ఆయన ఓ తమిళ చిత్రంలో నటించారు. చెన్నైలోని పొయెస్ గార్డెన్‌లో ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.
![]() |
![]() |