![]() |
![]() |

‘‘ఓటీటీ వల్ల నటీనటులకు పని దొరుకుతోంది. ఏదో ఒక వెబ్ సిరీస్ లేదా సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ముంబైలో నటీనటులు ఎవరూ ఖాళీగా లేరు. ఇదొక శుభ పరిణామం’’ అని పంకజ్ త్రిపాఠీ అన్నారు. ‘మీర్జాపూర్’, ‘సేక్రెడ్ గేమ్స్’, ‘క్రిమినల్ జస్టీస్’ వంటి సూపర్‌హిట్ వెబ్ సిరీస్‌లలో ఆయన నటించారు.
‘మీర్జాపూర్’ రెండో సీజన్ ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం పంకజ్ త్రిపాఠీ ప్రత్యేకంగా తెలుగు మీడియాతో మాట్లాడారు. ‘మీర్జాపూర్ 2’ విడుదల తేదీ ప్రకటించే వరకూ తెలుగు ప్రేక్షకులు కొందరు సోషల్ మీడియాతో సెకండ్ సీజన్ విడుదల ఎప్పుడని కనీసం రోజుకు ఇద్దరు అడిగేవారని ఆయన అన్నారు. తెలుగు చిత్రం ‘దూసుకెళ్తా’లో నటించారీ హిందీ నటుడు. దానికంటే ‘మీర్జాపూర్’లో కాలిన్ భయ్యా పాత్ర అతడిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. సెకండ్ సీజన్ తెలుగులో విడుదలవుతోంది.
‘‘మొదటి సీజన్ విడుదలైనప్పుడు మంచి పేరొస్తుందనీ, ఘన విజయం సాధిస్తుందని నాకు నమ్మకముంది. కానీ, చాలామందికి ఎటువంటి అంచనాలు లేవు. తొలి సీజన్ విజయంతో మలి సీజన్‌పై అంచనాలు పెరిగాయి. వాటిని అందుకునేలా ‘మీర్జాపూర్ 2’ ఉంటుంది. దీనికీ రైటింగే బలం. చక్కటి కథ, ఆసక్తికరమైన మలుపులతో దర్శక, రచయితలు మంచి సన్నివేశాలు రాశారు. ఈ రెండో సీజన్ మరింత ఉత్కంఠగా ఉంటుంది’’ అని పంకజ్ త్రిపాఠీ తెలిపారు. తెలుగు నుంచి అవకాశాలు వస్తున్నాయని అన్నారు. కానీ, హిందీ చిత్రాలతో బిజీగా ఉండటం వలన చేయలేకపోతున్నానని తెలిపారు.
![]() |
![]() |