![]() |
![]() |

పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన 'బుడ్ఢా.. హోగా తేరా బాప్' (2001) తక్కువ బడ్జెట్‌లో రూపొంది, నిర్మాతలకు భారీ లాభాలు ఆర్జించిపెట్టింది. అమితాబ్ ఆ సినిమా ఒప్పుకోవడంలో రామ్‌గోపాల్ వర్మ ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఆ సందర్భంగా అమితాబ్‌ను పూరి ముందే ఆయన "ఐ హేట్ యూ" అని వెళ్లిపోయారనే విషయం ఆ ముగ్గురికి మాత్రమే తెలుసు. ఆ కథేమిటంటే...
పూరి జగన్నాథ్ ఓ ఇంగ్లీష్ ఫిల్మ్ చూశాడు. ఆ కంటెంట్ నచ్చి, దాన్ని బేస్ చేసుకొని అమితాబ్‌తో ఓ సినిమా చెయ్యాలని అనుకున్నాడు. తన గురువైన ఆర్జీవీకి ఫోన్ చేశాడు. "నేను బచ్చన్ గారితో సినిమా చెయ్యాలి. ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూశాను" అని చెప్పాడు. "ఇంగ్లీష్ ఫిల్మ్ ఎందుకు.. నువ్వు కథ రాయలేవా?" అన్నారు ఆర్జీవీ. "రాస్తాను" అన్నాడు పూరి. "మరి.. రాయి" అని ఫోన్ పెట్టేశాడు ఆర్జీవీ.
పూరికి కోపం వచ్చింది. తాను కథ రాయలేనా.. అనుకొని వారం రోజుల్లో కథ రాసేశాడు. రాము (ఆర్జీవీ) దగ్గరకు వెళ్లాడు. కథ రెడీ అయ్యిందని చెప్పాడు. ఆయన స్టోరీ ఏంటని కూడా అడగకుండా, పూరి ముందే అమితాబ్‌కు ఫోన్ చేశారు. "ఇప్పుడే జగన్ వచ్చి నాకు కథ చెప్పాడు. ఫెంటాస్టిక్ స్టోరీ. సర్కార్.. నువ్వు అర్జంటుగా ఈ సినిమా చెయ్యాలి" అన్నారు. అమితాబ్, రాము ఒకర్నొకరు 'సర్కార్' అని పిలుచుకుంటూ ఉంటారు. అమితాబ్ రమ్మన్నారు. రాము, పూరి కలిసి అమితాబ్ ఇంటికి వెళ్లారు. అమితాబ్‌ను కలవడం పూరికి అదే ఫస్ట్ టైమ్.
కథ చెప్పమన్నారు అమితాబ్. ఆర్జీవీ కూడా ఆ పక్కనే కూర్చున్నాడు. రాము ఉంటే తాను కథ చెప్పనని అన్నాడు పూరి. "ఎందుకని?" అనడిగారు బిగ్ బి. "ఇద్దరు పెద్దవాళ్లకు ఒకేసారి కథ చెప్పి మేనేజ్ చెయ్యడం కష్టం, మీ ఒక్కరికే చెప్తాను" అన్నాడు పూరి. "సర్కార్ నువ్వు బయటకెళ్లు" అన్నారు అమితాబ్. రాము బయటకు వెళ్లిపోయాడు. అమితాబ్‌కు ఒక గంటలో కథ చెప్పాడు పూరి. అయ్యాక రామును లోపలికి పిలిచారు అమితాబ్. ఈ కథ అప్పటికే రాముకు తెలుసని ఆయన అనుకుంటున్నారు.
"సర్కార్.. ఈ స్టోరీలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి." అంటూ ఓ సీన్ చెప్పబోయారు అమితాబ్. అప్పుడు ఆర్జీవీ "సర్కార్.. మీరు వంద సినిమాలు చేయొచ్చు, నేను వంద సినిమాలు చేయొచ్చు. యువర్ నాలెడ్జ్.. మై నాలెడ్జ్.. వాడేదో మీ ఫ్యాన్. మీతో సినిమా చేస్తానంటున్నాడు. వాడి స్టోరీలో డౌట్లు అడుగుతారేంటి సర్కార్. ఈ సినిమా ఆడదు.. అమితాబ్ బచ్చన్ ఏమైనా పడిపోతాడా? పోనీ హిట్టయ్యిందీ.. అమితాబ్ ఏమైనా ఇంకో ఎత్తుకు ఎదుగుతాడా? ఈ పిల్లాడ్ని పట్టుకొని క్వశ్చన్స్ వేయకండి సర్కార్. ఐ హేట్ యూ." అని పూరిని తీసుకొని అక్కడ్నుంచి వచ్చేశారు రాము.
ఆ మరుసటి రోజు ఫోన్ చేసి, షూటింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్పారు అమితాబ్. ఆ తర్వాత మళ్లీ ఏ ప్రశ్నా వెయ్యకుండా ఆ సినిమా చేశారాయన. ఈ జరిగిన కథనంతా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పూరి.
![]() |
![]() |