![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన సంస్థల్లో శ్రీదేవి మూవీస్ ఒకటి. `ఆదిత్య 369` (1991), `వంశానికొక్కడు` (1996).. ఇలా బాలయ్య కెరీర్ లో మెమరబుల్ మూవీస్ గా నిలిచిన చిత్రాలను శ్రీదేవి మూవీస్ సంస్థనే నిర్మించింది. ఈ అలాంటి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం `భలేవాడివి బాసూ!`. అంతేకాదు.. `సమరసింహారెడ్డి` వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత బాలయ్యకి జోడీగా అంజలా ఝవేరి నటించిన సినిమా ఇదే కావడం విశేషం. అలాగే, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తరువాత బాలకృష్ణ - మెలోడీబ్రహ్మ మణిశర్మ కాంబినేషన్ లో మూడో చిత్రమిది. అదే విధంగా.. `తమ్ముడు` వంటి బ్లాక్ బస్టర్ తరువాత పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. అన్నింటికి మించి `నరసింహనాయుడు` వంటి సంచలన చిత్రం అనంతరం వెనువెంటనే వచ్చిన బాలయ్య చిత్రమిది. ఇలా.. ఎన్నో అంచనాలు, పాజిటివ్ వైబ్స్ మధ్య వచ్చిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా బాలయ్య అభిమానులను మురిపించింది.
శిల్పాశెట్టి మరో నాయికగా నటించిన ఈ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో వెంకట్, ప్రకాశ్ రాజ్, సుధాకర్, బ్రహ్మానందం, సుమిత్ర, భూపేందర్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. మణిశర్మ బాణీలతో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ వినసొంపుగా ఉంటాయి. మరీముఖ్యంగా.. ``అయ్యరే అయ్యారే అయ్య`` అంటూ సాగే మెలోడీ గీతం అప్పట్లో సంగీతప్రియులను విశేషంగా అలరించింది. 2001 జూన్ 15న విడుదలై మ్యూజికల్ గా మెప్పించిన `భలేవాడివి బాసూ!`.. నేటితో 20 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |