![]() |
![]() |

సూపర్ స్టార్ రజినీకాంత్ ని కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుల్లో స్టార్ కెప్టెన్ శంకర్ ఒకరు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `శివాజీ - ది బాస్`. శంకర్ గత చిత్రాల తరహాలోనే సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో రజినీకాంత్ కి జోడీగా శ్రియ నటించగా సుమన్ ప్రతినాయకుడిగా దర్శనమిచ్చారు. వివేక్, రఘువరన్, మణివణ్ణన్, వడివుక్కరసి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రత్యేక గీతంలో తళుక్కుమంది. స్వర్గీయ దర్శకుడు కేవీ ఆనంద్ అందించిన ఛాయాగ్రాహణం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.
స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``వాజీ వాజీ``, ``సహానా శ్వాసే వీచేనో`` గీతాలు అటు ఆడియోపరంగానూ, ఇటు విజువల్స్ పరంగానూ మెప్పించాయి. `బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్` విభాగంలో `జాతీయ పురస్కారం` అందుకున్న ఈ చిత్రం.. `ఉత్తమ సంగీత దర్శకుడు`, `ఉత్తమ ఛాయాగ్రాహకుడు` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను అందుకుంది. ఏవీఎం ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్. గుహన్, ఎం.శరవణన్ నిర్మించిన `శివాజీ`.. 2007 జూన్ 15న రిలీజై విడుదలైన అన్ని చోట్ల కాసుల వర్షం కురిపించింది. నేటితో ఈ సెన్సేషనల్ మూవీ 14 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |