![]() |
![]() |

దివంగత ప్రముఖ నటులు దేవదాస్ కనకాల తనయుడైన రాజీవ్ కనకాల తండ్రి బాటలోనే నడిచి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. మొదట బుల్లితెరపై ఆల్‌రౌండర్ అనిపించుకున్న రాజీవ్ ఆ తర్వాత పూర్తిగా సినిమాల మీదే దృష్టి కేంద్రీకరించి పలు మంచి పాత్రలతో ఆకట్టుకున్నాడు. నిజానికి ఆయనకున్న అభినయ సామర్థ్యానికి ఇంకా మంచి పాత్రలు రావాల్సిందనేది విమర్శకుల అభిప్రాయం. జూనియర్ ఎన్టీఆర్‌తో రాజీవ్‌కు మంచి అనుబంధం ఉంది.
రాజమౌళి డైరెక్ట్ చేసిన 'స్టూడెంట్ నెం.1' మూవీలో తారక్‌తో కలిసి నటించినప్పుడు ఏర్పడిన స్నేహం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ఆ సినిమాతోటే రాజీవ్ సినిమాల్లో ఫస్ట్ బ్రేక్ సాధించాడు. అందులో తారక్‌కు దీటైన పాత్ర పోషించి మెప్పించడంతో వరుస అవకాశాలు వచ్చాయి.
అందుకే 'స్టూడెంట్ నెం.1' సినిమా అన్నా, అందులోని పాటలన్నా రాజీవ్‌కు ఇష్టం. మరీ ముఖ్యంగా ఫేర్‌వెల్ సాంగ్ అంటే మరీ ఇష్టం. నిజానికి అది యూత్‌ఫుల్ సాంగ్. "అయినా ఈ పాట కుర్రాళ్లకే పరిమితం కాదు, హైస్కూలు చదివే కుర్రాళ్ల దగ్గర్నుంచీ, రిటైరైపోయిన వాళ్ల వరకూ అందరికీ నచ్చుతుంది. అలాగే తామూ ఫేర్‌వెల్ చేసుకోవాలని కుర్రాళ్లు భవిష్యత్ కోసం ఉవ్విళ్లూరితే, వయసైపోయిన వాళ్లు తమ కాలేజీ స్మృతుల్ని మళ్లీ వెలికి తీసుకొని మురిసిపోతారు. అందుకే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంది. నేను కూడా కాలేజీ వయసులో అల్లర్లు చేశాను. ఈ పాట వింటుంటే ఆ అల్లర్లు అన్నీ గుర్తుకువస్తాయి." అని చెప్పాడు రాజీవ్.
ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చి పాడిన ఈ "ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.." అనే ఫేర్‌వెల్ సాంగ్‌ను చంద్రబోస్ సూపర్బ్‌గా రాశారు. "ఈ పాట చిత్రీకరణలో కూడా మంచి ఫీల్ ఉంది. సరదా కోసమే ఈ అల్లర్లు చేశామని పాజిటివ్ వేలో చెప్పడం బాగుంది. అన్నాళ్లు కలిసిమెలిసి తిరిగినవాళ్లు విడిపోయే ముందు కలిగే ఎమోషన్‌ను పాటలో బాగా నింపారు." అంటాడు రాజీవ్.
ఈ సినిమాతోటే రాజమౌళి డైరెక్టర్‌గా పరిచయం కాగా, హీరోగా తారక్ తొలి హిట్‌ను అందుకున్నాడు. రూ. 2 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 10 కోట్లు వసూలు చేసింది.
![]() |
![]() |