![]() |
![]() |

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అల్లరి నరేష్. అతడు కామెడీ ఎంత బాగా చేయగలడో... సీరియస్ రోల్స్ కూడా అంతే బాగా చేయగలడు. 'నేను', 'గమ్యం', 'శంభో శివ శంభో' సినిమాలు నరేష్ లో నటుడిని ప్రేక్షకులకు చూపించాయి. అయితే... ఆర్టిస్టుగా పేరు వచ్చే అటువంటి సినిమాలను అల్లరి నరేష్ ఎందుకు ఎక్కువ చేయలేదు? అంటే... అందుకు ఈవీవీ కారణం అని డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ దేవి ప్రసాద్ అంటున్నారు.
అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా సినిమా 'నాంది'. దీంతో హరీష్ శంకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా లేటెస్ట్ టీజర్ 'బ్రీత్ ఆఫ్ నాంది' శుక్రవారం విడుదల చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఓ సమస్యను తీసుకుని సీరియస్ సినిమాగా తీశారని టీజర్లు చూస్తే అర్థమవుతుంది. 'గమ్యం' తరహా సినిమా అని యూనిట్ సభ్యులు కూడా చెబుతున్నారు.
గతంలో నరేష్ హీరోగా తాను కామెడీ సినిమాలు చేశానని... అయితే ఆయన చేసిన సీరియస్ సినిమాలు చూశాక ''నరేష్ తో అటువంటి సినిమా చేయాలని ఉందని ఈవీవీ సత్యనారాయణ గారితో చెప్పాను. ఇప్పట్లో అటువంటివి వద్దు'' అని ఆయన అన్నారని దేవి ప్రసాద్ చెప్పారు. దాంతో తన ప్రయత్నం విరమించుకున్నానని తెలిపారు. 'నాంది' తర్వాత నటుడిగా నరేష్ మరింత ఎత్తుకు ఎదుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. 'నాంది' సినిమాలో దేవి ప్రసాద్ ఓ పాత్ర చేశారు.
![]() |
![]() |